సీఎం జగన్ పీఆర్ టీమ్.. అట్టర్ ఫ్లాప్!

Update: 2019-08-09 17:51 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అతి పబ్లిసిటీకి దూరంగానే ఉంటున్నారు. ఇంతచేస్తే అంత చెప్పుకున్న చంద్రబాబు నాయుడు విషయంలో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును పరిశీలించాకా అతి ప్రచారం చేయకుండా ఉండటమే నేతలకు కూడా మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి పీఆర్ టీమ్ మాత్రం కొన్ని ప్రాథమిక  విషయాలను కూడా మరిచిపోయినట్టుగా ఉంది.

గత కొన్ని రోజుల పరిణామాలు ఈ అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అందుకు ఉదాహరణలను  కూడా ప్రస్తావించవచ్చు. పారిశ్రామికవేత్తల, పెట్టుబడిదారుల సదస్సు విషయంలో కనీసం జర్నలిస్టులకు కూడా సరైన సమాచారాన్ని అందించలేదు జగన్ మోహన్ రెడ్డి పీఆర్ టీమ్.

ఆ సదస్సుకు ప్రముఖ ఫైనాన్షియల్ వార్తా పత్రికల జర్నలిస్టులకు కానీ, జాతీయ మీడియా వర్గాలకు  కానీ తగిన సమాచారం, ఆహ్వానాలు లేవని తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలను హైలెట్ చేస్తూనే కొన్ని వార్తా పత్రికలు అచ్చు అయ్యే సంగతి తెలిసిందే. అలాంటి పత్రికలకు కూడా ఏపీ ప్రభుత్వం తరఫు నుంచి ఆ కార్యక్రమానికి ఆహ్వానాలు అందలేదంటే సీఎంఓ పీఆర్ టీమ్ ఎంత దారుణంగా పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి కార్యక్రమాల గురించి ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయించుకోనక్కర్లేదు. ఫైనాన్షియల్ పత్రికల్లో అలాంటి వార్తలు  అచ్చు వేయడం ద్వారా బోలెడంత ప్రయోజనం ఉంటుంది. కొత్తగా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అలాంటి వార్తలు కూడా దోహదం చేస్తాయి.అయితే ఏపీ సీఎంవో పీఆర్ టీమ్ మాత్రం ఆ సదస్సుకు  తగిన మీడియా కవరేజ్ ఇప్పించడంలో ఫ్లాప్ అయ్యింది.

ఇక  మరోవైపు తమిళనాడునుంచి మంత్రులు వచ్చి జగన్ ను కలిశారు. చెన్నైకి  తాగునీటిని అందించమని కోరారు. దానికి  సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల మధ్య సౌభ్రాతృత్వం సరిగా లేదు. ఇలాంటి తరుణంలో జగన్ స్పందన ఆసక్తిదాయకమే. మరి దాన్ని హైలెట్ చేయించుకుని మీడియాలో కవరేజ్ ఇప్పించుకోవడం కూడా పీఆర్ టీమ్ కు చేత కాలేదు. ఏదో ప్రెస్ నోట్ విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు. సీఎంవో పీఆర్ టీమ్ చేయాల్సింది అంతేనా?
Tags:    

Similar News