రూ.1.11కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారికి పూజలు
దసరా సందర్భంగా తెలంగాణలో సంబరాలు అంబరాన్నంటాయి. దుర్గామాత వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణలోని ఒక ప్రసిద్ధ ఆలయంలో ప్రతిష్టించిన దుర్గామాతకు ఏకంగా 1.11 కోట్ల కరెన్సీ నోట్లతో 50 వేల ఓరిగామి పువ్వులతో దేవతను అలంకరించడం విశేషంగా మారింది.. హైదరాబాద్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో గద్వాల్ లో ఉన్న శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో ఈ వైభవం చోటుచేసుకుంది.. దేవాలయ నిర్వాహకులు కరెన్సీ నోట్లతో చేసిన దండలు, ఓరిగామి పువ్వులతో దేవతను అలంకరించారు.
ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ఇలా నగదును అలంకరించి భక్తులు ఖరీదైన సమర్పణగా ఖ్యాతికెక్కారు.. ధనలక్ష్మి అవతారంలో రూ.1.11 కోట్ల కరెన్సీతో కొలువుదీరిన అమ్మవారిని చాలా మంది భక్తులు సందర్శించి పూజలు చేశారు.ఈ నవరాత్రి వేడుకలను ఆర్య వైశ్య సంఘం నిర్వహిస్తోంది. అంతా బడాబాబులే కావడంతో ఇలా డబ్బులతో అమ్మవారిని అలంకరించారు. ఈ సంప్రదాయం ప్రతీ సంవత్సరం వస్తోంది.
కరోనా మహమ్మారి రాకతో వచ్చిన ఆర్థిక సంక్షోభంలో రూ.1.11 కోట్ల కరెన్సీతో అమ్మవారిని అలంకరించడం చాలా ఖరీదైనదిగా ఆలయ కోశాధికారి పి. రాము తెలిపారు. సాంప్రదాయాలు.. నమ్మకాల ముందు ఈ కరోనా వైరస్ అంటువ్యాధి సంక్షోభం భక్తులను ఉత్సవాలు జరుపుకోకుండా ఆపలేదని ఆయన అన్నారు. గత సంవత్సరం వేడుకల్లో ఇప్పటికంటే ఎక్కువ మొత్తాన్నే అమ్మవారికి అలంకరించారని తెలిపారు.. గత సంవత్సరం ఏకంగా రూ .3,33,33,333 విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని కొలిచారన్నారు.
స్థానిక ఆర్య సమాజం భక్తుల నుండి అందించిన ఈ డబ్బు పూజలు చేసిన తరువాత వాటిని తిరిగి ఇస్తారు. సుమారు 40 నుండి 50 మంది భక్తులు ఈ ప్రత్యేకమైన నగదు అలంకరణలకు దోహదపడ్డారు.
ఈ కరెన్సీ దండలు మరియు బొకేల తయారీ.. ప్రత్యేకమైన డిజైన్ల కోసం నిపుణులైన వారిని పిలిపించి ఇలా తీర్చిదిద్దారు. కరోనా మహమ్మారి ప్రజలను ప్రభావితం చేసినప్పటికీ, సంప్రదాయాలను పాటించకుండా అది భక్తులను ఆపకపోవడం విశేషమనే చెప్పొచ్చు.