వాళ్లకు వార్నింగ్ ఏమో కానీ.. మీ గురించి మీరు మాట్లాడుకున్నట్లే ఉంది వంశీ

Update: 2023-02-02 23:00 GMT
గురివింద సామెత విన్నారుగా? తన నలుపును చూసుకోకుండా.. ఊరి నలుపు గురించి మాట్లాడుతుందంటారు. తాజాగా వల్లభనేని వంశీ మాటలు వింటే అదే రీతిలో ఉందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి.. వైసీపీకి జంప్ అయి.. ఆ పార్టీ తరఫున నిలుచున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తు.. ప్రజాప్రతినిధిని చేసిన పార్టీ అధినేతను ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడే విషయంలో అందరి కంటే ముందుంటారు వల్లభనేని వంశీ. అలాంటి ఆయనకు తాజాగా కోపం వచ్చింది.

ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పార్టీని కాదని.. అధికార పక్షం గోడ దూకేసి.. ‘ఫ్యాన్’ కింద సేద తీరుదామని ఎంతలా తపిస్తున్నా.. ఆ పార్టీలో మొదట్నించి ఉన్నోళ్లు మాత్రం ససేమిరా అనటం. వంశీని తమ వాడిగా ఒప్పుకునేందుకు నో అంటే నో అన్నట్లుగా వ్యవహరిస్తున్న యవ్వారం ఒక పట్టాన తేలటం లేదు. ఇదిలా ఉంటే.. వైసీపీలో మొదట్నించి ఉన్న నేతలు.. వంశీతో కలిసేదే లేదన్నట్లుగా మాట్లాడుతున్న మాటలు.. ఆయనపై చేస్తున్న విమర్శల విషయంలో వల్లభనేని వంశీ సీరియస్ అయిపోతున్నారు.

తనను ఉద్దేశించి విమర్శలు చేసే వారి సంగతి చూస్తానంటూ ఘాటుగా రియాక్టు అయిన ఆయన మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. అయితే.. తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడిన వల్లభనేని వంశీ మాటలు ఇప్పుడు వైలర్ గా మారాయి. అయితే.. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే.. వైసీపీలో చేరిన మొదట్లో తనకు టికెట్  ఇచ్చిన టీడీపీ అధినేత.. పద్నాలుగున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబును ఉద్దేశించి ఎంతలా నోరు పారేసుకున్నారో అందరికి తెలిసిందే.

తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును అనరాని మాటలు అనేసిన వల్లభనేని వంశీకి తాజాగా షాకులు తగులుతున్నాయి. వైసీపీకి చెందిన యార్లగడ్డ వెంకట్రావు.. దుట్టా రామచంద్రరావులు వంశీ విద్యార్హత మీదా.. ఆస్తుల మీదా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వంశీ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. గతంలో తను తన స్థాయిని మరిచి వ్యవహరించిన తీరును గుర్తుకు వచ్చేలా ఉండటం ఆసక్తికరంగా మారింది.
4

యార్లగడ్డ.. దుట్టాలను ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..

‘‘పిల్లి అద్దం ముందు నిలుచొని పులి అంటే.. అయిపోదు. వాడి పొజిషన్ ఏంటో చూసుకొని మాట్లాడుకోవాలి. వాడికి వాడు హీరో అనుకుంటే ఎట్లా సరిపోతుంది?’’ (చంద్రబాబును ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు వంశీ స్థాయి ఏంటి? మరి.. ఆ రోజున ఆయన చేసిన మాటలకు తాజాగా ఆయన చేసిన మాటల్నే రిపీట్ చేసి వినిపిస్తే? ‘‘ముక్కు ముఖం లేనోళ్లంతా మమ్మల్ని విమర్శించి.. మీ మీడియా వాళ్లు చూపిస్తే.. వాళ్లేదో పెద్దోళ్లు అవుతున్నారని అనుకుంటున్నారు’’

(తాను చంద్రబాబు పార్టీ టికెట్ ఇస్తే.. 2014, 2019లో గెలిచానే తప్పించి.. ఇంకేమీ కాదన్న విషయాన్ని మర్చిపోయిన వంశీ నోటికి వచ్చినట్లుగా మాట్లాటం తెలిసిందే. ఈ రోజున తన రాజకీయ ప్రత్యర్థులు విరుచుకుపడితే.. నీతులు చెప్పే క్రమంలో మాట్లాడిన వంశీ.. గతంలో తాను చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినప్పుడు తన స్థాయి కూడా అంతేనన్న విషయాన్ని ఆయన ఇప్పటికైనా గుర్తిస్తారా?
‘‘వంశీని తిడితేనో.. నానిని తిడితేనో మనం పెద్దోళ్లం అవుతున్నామని వాళ్లంతట వాళ్లే చెప్పుకుంటున్నారని.. మీరే (మీడియాను ఉద్దేశించి) చెబుతున్నారు. అటువంటోళ్ల గురించి ఏం చెబుతాం. పెద్దోళ్లు కావటం కోసమే విమర్శలు చేయటం. వాళ్లకో స్థాయి లేదు కాబట్టి.. వాళ్లకో క్యారెక్టర్ లేదు కాబట్టి.. వాళ్లు పెద్దోళ్లు కావటం కోసం ప్రయత్నం చేస్తున్నారు’’

(తాను గెలిచిన పార్టీ అధికారంలో లేని నేపథ్యంలో అధికార పార్టీలోకి వెళ్లిన వంశీ.. అక్కడ తన స్థాయిని మరింత పెంచుకునేందుకు.. చంద్రబాబు లాంటి సీనియర్ నేతను.. ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు.. విభజన తర్వాత ఏపీకి ఒకసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు లాంటి నేతను ఉద్దేశించి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే తప్పించి తనకు ఉనికి.. గుర్తింపు లభిస్తుందన్న అత్యాశతోనే వల్లభనేని వంశీ నోటికి పని చెప్పారా? అన్నది ప్రశ్న.

వంశీ తాజా మాటల్ని విన్నప్పుడు  ఇలాంటి డైలాగులు విన్నప్పుడు.. కాలానికి మించిన సరైన మందులు ఇంకేం ఉండదన్న భావన కలుగక మానదు. అప్పట్లో నోరు పారేసుకున్న వల్లభనేని వంశీ.. తన రాజకీయ ప్రత్యర్థులు చేసే వ్యాఖ్యలకు ఇంతలా రియాక్టు అయితే.. తన పాపులార్టీ పెంచుకోవటం కోసమే గతంలో చంద్రబాబు అండ్ కోను నోటికి వచ్చినట్లు మాట్లాడానన్న నిజాన్ని వంశీ ఒప్పేసుకున్నట్లేనా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News