వ‌ర్ల రామ‌య్య‌కు బాబు రెండు ఆఫ‌ర్లు.. ఏంటంటే!

Update: 2020-09-30 03:45 GMT
టీడీపీలో తాజాగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జుల నియామ‌కం పూర్త‌యింది. అయితే, కొంద‌రికి ప‌ద‌వులు ద‌క్క‌లేదు. పార్టీలో కీల‌కంగా ఉన్న‌వారు.. పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్న‌వారు.. ప‌ద‌వులు ద‌క్క‌క పోవ‌డంతో నిరాశ‌లో కూరుకుపోయారు. తాము పార్టీలో ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని, అయినా త‌మ‌కు ఎలాంటి గుర్తింపు ల‌బించ‌లేద‌ని వాపోతున్న‌వారు క‌నిపిస్తున్నారు. ఇలాంటి వారిలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ‌ర్ల రామ‌య్య ఒక‌రు. ఈయ‌న సుమారు ఒక‌టిన్న‌ర ద‌శాబ్దకాలంగా పార్టీలో ఉన్నారు. గ‌తంలో పామ‌ర్రు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అదేవిధంగా తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్ర‌మంలోనే పార్టీ లో పొలిట్‌ బ్యూరో ప‌ద‌విని ఇచ్చారు చంద్ర‌బాబు. కానీ, దీనిక‌న్నా మంచి ప‌ద‌వి కావాల‌ని, త‌న వాయిస్‌ను మ‌రింత బ‌లంగా వినిపించే అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఈ నేప‌థ్యం లోనే ఇటీవ‌ల రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌ర్ల‌రామ‌య్య‌కు చంద్ర‌బాబు చాన్స్ ఇచ్చారు. అయితే, బ‌లం లేని స‌మ‌యంలో ఇలాంటి చాన్స్ ఇచ్చినా.. ప్ర‌యోజ‌నం ఏంట‌ని భావించ‌కుండా.. వ‌ర్ల పోటీకి దిగారు. చివ‌రాఖ‌రుకు ఓడిపోయారు. దీంతో ఇటీవ‌ల కాలంలో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జ్‌ల‌ను నియ‌మిస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన నాటి నుంచి ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు.

తిరుప‌తి లేదా చిత్తూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌ గా త‌న పేరు ఖాయ‌మ‌ని అనుకున్నారు.కానీ, ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వీ ద‌క్క‌లేదు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌గానే కాకుండా.. రెండేసి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక ఇంచార్జ్‌ ను ఎంపిక చేసినా.. కూడా ఆ జాబితాలోనూ ఈయ‌న పేరు క‌నిపించ‌లేదు. దీంతో తీవ్ర నిరాశ‌ కు గురైన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే వ‌ర్ల‌కు చంద్ర‌బాబు రెండు ఆఫ‌ర్లు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి ఇంచార్జ్ కావాల్సిన నేప‌థ్యంలో ఆ నియోజ‌క‌ వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను వ‌ర్ల‌కు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించారు. లేదంటే.. పొలిట్ బ్యూరో లోనే కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నార‌ట‌. మ‌రి వ‌ర్ల ఎలా డిసైడ్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News