‘కెప్టెన్.. ఆయన భార్య’ను అరెస్ట్ చేయమన్న కోర్టు

Update: 2016-07-27 06:51 GMT
తమిళనాడు రాజకీయాలు ఎంత కరుకుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాజకీయాల మీదిరి ఏ మాట పడితే ఆ మాట అంటే.. రాజకీయం కదా సర్లే అన్నట్లుగా వ్యవహారం ఉండదు. మాట ఏమాత్రం తేడా వచ్చినా కేసుల రూపంలో చుట్టుకునే పరిస్థితి. తాజాగా డీఎండీకే అధినేత విజయ్ కాంత్.. ఆయన సతీమణి ప్రేమలతల్ని అరెస్ట్ చేసి కోర్టుకు ముందు హాజరు పర్చాలంటూ తిరుప్పూర్ కోర్టు ఆదేశాలు జారీ చేయటం సంచలనంగా మారింది.

ముఖ్యమంత్రి జయలలిత మీద విజయ్ కాంత్.. ఆయన సతీమణి ప్రేమలతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని..ఆమెను అవమానించారంటూ ప్రభుత్వ న్యాయవాది సుబ్రమణియన్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరు కావాలంటూ విజయ్ కాంత్.. ఆయన సతీమణికి కోర్టు తాఖీదులు ఇచ్చింది. ఇలాంటి వాటిని లైట్ తీసుకొని తలనొప్పులు తెచ్చుకునే రాజకీయ ప్రముఖుల మాదిరే కెప్టెన్..ఆయన సతీమణి ఇద్దరూ కోర్టు నోటీసుల్ని లైట్ తీసుకోవటం.. ఈ ఉదంతంపై కోర్టు సీరియస్ అయ్యింది.

కోర్టుకు రావాలంటూ సమన్లు జారీ చేసినా లైట్ తీసుకొని.. కోర్టుకు రాకపోవటాన్ని నిర్లక్ష్యంగా భావించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ కాంత్.. ఆయన సతీమణి ప్రేమలతలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయటంతో డీఎండీకే పార్టీ నేతల్లో గుబులు పుడుతోంది. కోర్టు పిలిచినప్పుడు మర్యాదగా హాజరైతే సరిపోయే దానికి.. అరెస్ట్ లవరకూ ఇష్యూను తెచ్చుకోవటం అవసరమా? అంటూ పలువురువిజయ్ కాంత్ ను తప్పు పడుతున్నారు.
Tags:    

Similar News