ఏపీ ఓటరు తీర్పు.. ఏవరికి అనుకూలం

Update: 2019-04-12 06:03 GMT
ఏపీలో ఓటర్లు పోటెత్తారు.. టీడీపీ - వైసీపీ - జనసేన మధ్య హోరాహోరీగా చావో రేవో అన్నట్టుగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ దాదాపు 80శాతానికి పైగా నమోదు కావడం అంటే అదో పెద్ద సంచలనమైన విషయమే.. ఓటర్లు ఇంత కసిగా ఎవరికి ఓటేశారనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిని తొలిచేస్తోంది. విదేశాల్లో ఉన్నవారు.. తెలంగాణ సహా పక్క రాష్ట్రాల్లో ఉపాధి - ఉద్యోగాలకు వెళ్లిన వారందరూ ఏపీకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారంటే ఆ ప్రభంజనం ఏమై ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ప్రాథమిక అంచనాల ప్రకారం.. అర్ధరాత్రి వరకు పోలింగ్ ఏపీలో నమోదైంది. పోలింగ్ శాతం ఎనభై దాటేస్తోందని.. ఎనభైనాలుగు శాతం వరకూ నమోదవుతుందని అంచనా.. ఏపీలోని పల్లెల్లో అయితే తొంభై శాతం వరకూ పోలింగ్ నమోదైంది. పట్టణాల్లో కాస్త తక్కువ నమోదైంది.

ఇక ఏపీలో మూడు పార్టీలు బరిలో ఉండడం కూడా పోలింగ్ శాతం పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఓటుపై మూడు పార్టీలు విస్తృతంగా ప్రచారం చేయడం.. ప్రలోభాలకు గురిచేయడం.. పోల్ మేనేజ్ మెంట్ స్కిల్స్ కూడా ప్రదర్శించడం కూడా పోలింగ్ శాతం పెరగడానికి కారణంగా  విశ్లేషకులు చెబుతున్నారు.  

ఇక ఏపీలో మహిళా ఓటర్లు పోటెత్తడం తమకే అనుకూలంగా తెలుగుదేశం భావిస్తోంది. సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారే ఇలా తమకు మద్దతు ఇచ్చారని టీడీపీ చెబుతోంది. ఇక వైసీపీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతతోనే భారీ ఎత్తున పోలింగ్ జరిగిందని.. ఇదే తమకు లాభిస్తుందని భావిస్తున్నారు.

తెలంగాణలో చంద్రబాబు ఫ్యాక్టర్ వల్లే అధికార టీఆర్ ఎస్ కు ఓట్ల వాన కురిసింది. అయితే అంతకుమించిన పోలింగ్ ఏపీలో జరిగింది.. ఈ భారీ పోలింగ్ ప్రభావం ఏమిటన్నది తేలడం లేదు. మరో నలభై రోజుల్లో ఫలితాల వరకు ఈ భారీ పోలింగ్ ఎవరికి లాభిస్తుందనేది తేలనుంది.
Tags:    

Similar News