సొంత పార్టీ నేతలపైనే గవర్నరుకు ఫిర్యాదు

Update: 2017-05-24 06:14 GMT
రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీల విధానాలు, వైఖరులు, చేసే పనులపై అప్పుడప్పుడు గవర్నరుకు ఫిర్యాదు చేస్తుంటాయి.  సొంత పార్టీలో అంతర్గతంగా ఏమైనా ఉంటే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తారే కానీ గవర్నరుకు ఫిర్యాదు చేయరు. కానీ... తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలపై గవర్నరుకు ఫిర్యాదు చేశారు.  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదనుకున్నారో ఏమో కానీ ఏకంగా గవర్నరు వద్దే తన గోడు వెల్లబోసుకున్నారు.

    అనంతపురం జిల్లాలో పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన గవర్నర్‌ నరసింహన్‌కు టీడీపీ శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినిబాల సొంత పార్టీ నేతలపైనే ఫిర్యాదు చేశారు. తమ నియోజకవర్గానికి టీడీపీ నేతలే అన్యాయం చేస్తున్నారని ఆమె గవర్నర్‌కు వివరించారు. శింగనమల నియోజకవర్గానికి నీరు ఇవ్వకుండా పక్క నియోజకవర్గాలకు టీడీపీ నాయకులే తరలించుకుపోతున్నారని ఆమె ఆరోపించారు.

    మధ్య పెన్నార్ డ్యాంలోకి ప్రతి సంవత్సరం నీరు వస్తోందని.. కానీ టీడీపీ నేతలు మాత్రం శింగనమల నియోజకవర్గానికి నీరు ఇవ్వకుండా వారివారి ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని యామిని బాల ఆరోపించారు. దీనిపై పలుమార్లు అధికారులకు, తమ పార్టీ నేతలకు విన్నవించుకున్నా ఎవరూ కూడా న్యాయం చేయలేదని యామిని బాల ఆరోపించారు. మీరైనా ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని యామినిబాల కోరారు.  కాగా టీడీపీ సీనియర్ లీడర్, యామినిబాల తల్లి, టీడీపీ ఎమ్మెల్సీ అయిన శమంతకమణి కూడా కుమార్తెతో గొంతు కలిపారు.
 
    దీనిపై టీడీపీలో చర్చ మొదలైంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ కలిసి సొంత పార్టీకి చెందిన ఇతర నేతలపై ఫిర్యాదు చేయడం అంటే అది చంద్రబాబు వైఫల్యమేనని పలువురు అంటున్నారు.
Tags:    

Similar News