రాజధాని సమస్యలపై చిన్నచూపు మొదలైంది!!

Update: 2015-07-10 17:30 GMT
నవ్యాంధ్ర రాజధాని సమస్యలపై సర్కారు చిన్న చూపు మొదలైందని, ఇకనుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందేమోనని రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ సమీకరణ పూర్తయ్యే వరకూ చంద్రబాబు నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకూ పలువురు పలుసార్లు వచ్చారని, మంత్రులు అయితే ఇక్కడే తిరిగారని, తీరా భూ సమీకరణ పూర్తయ్యాక ఒక్కరు కూడా పత్తా లేరని విమర్శిస్తున్నారు. సమీకరణతో ముడిపడిన సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని ధ్వజమెత్తుతున్నారు.

రాజధాని భూ సమీకరణ తర్వాత కౌలు రైతులకు నెలకు రూ.2500 చొప్పున పరిహారం ఇస్తామని, ప్రతి నెలా వారికి చెక్కులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీని గురించి ప్రభుత్వం ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. రాజధాని ప్రాంతంలోని భూములను చదును చేసేసింది. అక్కడి కూలీల ఉపాధిని మింగేసింది. కానీ, వారికి జీవనోపాధి మాత్రం కల్పించడం లేదు. అలాగే, డాక్యుమెంట్లలో ఉన్న భూమికి, సర్వేలో ఉన్న భూమికి చాలా చోట్ల వ్యత్యాసం వచ్చింది. ఈ విషయం తేలుస్తామని చెప్పి రెండు నెలలు దాటింది. ఇప్పటి వరకు తేల్చలేదు. దాంతో రైతులకు చెక్కుల విడుదల నిలిచిపోయింది. అసైన్‌మెంట్‌ భూముల లబ్ధిదారులు ఎవరో తేల్చి పరిహారం ఇస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు దీనిని పట్టించుకున్న నాథుడు లేకపోయాడు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.

రాజధాని నిర్మాణానికి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్‌ తదితర విదేశాలకు తిరుగుతుంటే, నిన్న మొన్నటి వరకు ఇక్కడే తిరిగిన మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ఇప్పుడు ఈ అంశాన్నే పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం లైట్‌ తీసుకుంది కదాని అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దాంతో భూములు ఇచ్చిన రైతులు, కూలీలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News