శాసనాధికారాలను న్యాయవ్యవస్ధ కబ్జా చేస్తోంది - తమ్మినేని

Update: 2020-11-26 10:30 GMT
శాసనవ్యవస్ధ చేసే చట్టాలు అమలు కాకుండా న్యాయవ్యవస్ధ ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటోందని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అభిప్రాయపడ్డారు. గుజరాత్ లో జరిగిన స్పీకర్ల సదస్సులో తమ్మినేని మాట్లాడుతూ శాసనవ్యవస్ధ అధికార పరిధిలోకి న్యాయవ్యవస్ధ ప్రవేశించటమంటే శాసనవ్యవస్ధ అధికారాలను కబ్జా చేయటమే అంటూ చాలా గట్టిగా చెప్పారు. ఏపిలో  ప్రభుత్వానికి, న్యాయవ్యవస్ధకు మధ్య జరుగుతున్న వ్యవహారాలను దృష్టిలో పెట్టుకునే స్పీకర్ పై వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమైపోతోంది.

రాజ్యాంగానికి మూలస్ధంబాలపైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్ధలు దేనికదే స్వతంత్ర ప్రత్తి కలిగిన విషయాన్ని తమ్మినేని గుర్తుచేశారు. ప్రతి వ్యవస్ధకు దాని స్వతంత్రత దానికి ఉన్నట్లే హద్దులు కూడా ఉంటాయన్న విషయాన్ని ఏ వ్యవస్ధ కూడా మరచిపోకూడదన్నారు. గతంలో మూడు వ్యవస్ధలు బాధ్యతగా వ్యవహరించటం వల్లే ప్రజాస్వామ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోయిందన్నారు.

తాజాగా జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తు పై వాళ్ళ ముఖస్తుతి కోసం విధులను, బాధ్యతలను కూడా పక్కన పెట్టేస్తున్నట్లు మండిపడ్డారు. చట్టసభలో ఎంతో చర్చించి చేస్తున్న చట్టాలు అమలు కాకుండా ప్రతిపక్షాలు రాజకీయ స్వలాభం కోసం చట్టాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నట్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చట్టాలు అమలుకాకుండా జ్యుడిషియర్ అడ్డుకోవటం వల్లే రెండు వ్యవస్ధల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్నట్లు సీతారామ్ అభిప్రాయపడ్డారు.

ఏపిలో ఇపుడు జరుగుతున్న వ్యవహారాలను దృష్టిలో పెట్టుకునే సీతారామ్ మాట్లాడిన విషయం అందరికీ అర్ధమైపోతోంది. చట్టసభల నిర్వహణపైనా న్యాయవ్యవస్ధల జోక్యం పెరిగిపోతోందని స్పీకర్ మండిపడ్డారంటే దానికి కారణాలను ఎవరైనా ఊహించుకోవచ్చు. పరోక్షంగా ఏ ఒక్క రాజకీయ పార్టీ పేరు ప్రస్తావించకుండానే, న్యాయవ్యవస్ధలో ఎవరి పేరు చెప్పకుండానే, ఏ ఘటనను కూడా చెప్పకుండానే తాను చెప్పదలచుకున్న విషయం మొత్తాన్ని తమ్మినేని స్పష్టంగా చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News