ఎన్టీఆర్ ను ఎవ‌రైనా వాడేయొచ్చా?

Update: 2019-07-14 08:30 GMT
ఇందిరాగాంధీ బొమ్మ‌ను టీడీపీ వాడుకోగ‌ల‌దా?  వాజ్ పేయ్ బొమ్మ‌ను కాంగ్రెస్ వాడేయ‌గ‌లదా?  పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య బొమ్మ‌ను టీఆర్ఎస్ పెట్టుకోగ‌ల‌దా?  జ‌య‌శంక‌ర్ బొమ్మ‌ను బీజేపీ పెట్టుకోగ‌ల‌దా?  ఎంజీఆర్ ఫోటోను డీఎంకే ఫ్లెక్సీ మీద పెట్టుకోగ‌ల‌దా? అని ప్ర‌శ్నిస్తే నో అంటే నో అనేస్తారు. మ‌రే పార్టీలో లేని విచిత్రం టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ ఫోటో విష‌యంలో చోటు చేసుకుంటుంది.

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఎవ‌రైనా వాడేసే ప‌రిస్థితి. చ‌రిత్ర‌లో మ‌రే పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడికి లేని విచిత్ర‌మంతా ఎన్టీఆర్  సొంతం. పిల్ల‌ను ఇచ్చిన అల్లుడే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచేశారు. త‌న జీవితంలో తాను చేసిన అతి పెద్ద త‌ప్పు చంద్ర‌బాబును న‌మ్మ‌టంగా ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఎన్టీఆర్ ఫోటోను.. త‌ర్వాతి కాలంలో టీడీపీ కార్య‌క్ర‌మాల్లో పెద్ద ఎత్తున పెట్టుకోవ‌టంక‌నిపిస్తుంది.

ఏ పార్టీ అయితే త‌న‌ను బ‌య‌ట‌కు నెట్టేసిందో.. అదే పార్టీ వారికి ఎన్టీఆర్ ఫోటోనే దిక్కైంది. ఇటీవ‌ల కాలంలో ఎన్టీఆర్ బొమ్మ‌ను ఆయ‌న‌కు ఏ మాత్రం సంబంధం లేని పార్టీల వారు వాడేయ‌టం పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీల్లోనూ.. బ్యాన‌ర్ల‌లోనూ.. కొద్దిమంది అభిమానులు ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌ల్లోనూ ఎన్టీఆర్ ఫోటో క‌నిపించ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా ఈ తీరు ఎక్కువ‌గా క‌నిపించేది.

ఇదిలా ఉంటే.. తాజాగా టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రి మ‌ద్ద‌తుదారులు సైతం ఎన్టీఆర్ బొమ్మ‌ను య‌దేచ్ఛ‌గా వాడేస్తున్నారు. బీజేపీలోకి జంప్ అయ్యాక తొలిసారి విజ‌య‌వాడ‌కు వ‌చ్చేస్తున్న సుజ‌నాకు స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాటు చేసిన ప్ర‌చారంలో ఎన్టీఆర్ బొమ్మ‌ను ప్ర‌ముఖంగా వేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

సుజ‌నా తాజాగా నేతృత్వం వ‌హిస్తున్న బీజేపీకి ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. సుజ‌నాకు ఎన్టీఆర్ కు సంబంధ‌మే లేదు.  అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ ఫోటోను విప‌రీతంగా వాడేస్తున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తాజా ప‌రిణామాలు చూస్తే.. ఎన్టీఆర్ ఫోటోను ఎవ‌రైనా వాడేయొచ్చా?  అడిగేవాడే ఉండ‌డా? అన్న ప్ర‌శ్న‌లు ప‌లువురి నోట వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల‌కు ఆమోద‌యోగ్యుడైన నేత బొమ్మ‌గా ఎన్టీఆర్ మారారా?  అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News