పవన్లో మరీ ఇంత కన్ఫ్యూజనా ?

Update: 2022-05-21 04:29 GMT
రాజకీయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో బాగా అయోమయం కనబడుతోంది. అందుకనే ఏపీ పర్యటనలో ఒకలాగ తెలంగాణా పర్యటనలో మరోలాగ మాట్లాడుతున్నారు. ఏపీలో పర్యటించినపుడు అంతకుముందు పార్టీ ఆవిర్భావ సందర్భంగా జరిగిన బహిరంగసభలో మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం బాధత్య జనసేనే తీసుకుంటుందన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోను వైసీపీ అధికారంలోకి రాదని గట్టిగా చెప్పారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినిచ్చేది లేదని భీషణ ప్రతిజ్ఞే చేశారు. సీన్ కట్ చేస్తే ఏపీలోనే అధికారం ఆశించటంలేదు ఇక తెలంగాణాలో ఏమి ఆశిస్తాను అని అన్నారు. అంటే ఏపీ ఎన్నికల్లో అధికారంలోకి జనసేన రావటం కష్టమని తానే అంగీకరించినట్లయ్యింది. ఇదే సమయంలో వారసత్వ రాజకీయాలు పోవాలన్నారు.

ఒకవైపు చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పటమే విచిత్రంగా ఉంది.

అసలు ప్రాంతీయపార్టీ అంటేనే వారసత్వ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం పవన్ కు తెలీదా ? ఇదే సమయంలో తెలంగాణాలో రాబోయే ఎన్నికల్లో 20 శాతం సీట్లలో పోటీచేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

20 శాతం సీట్లంటే సుమారు 40 సీట్లన్నమాట. ఏపీతో పోలిస్తే తెలంగాణా రాజకీయాల్లో పవన్ పాత్ర దాదాపు లేదనే చెప్పాలి. అలాంటిది ఏపీ ఎన్నికల్లోనే ఎన్ని సీట్లకు పోటీచేయాలనే విషయంలో ఇప్పటివరకు క్లారిటిలేదు. అలాంటిది తెలంగాణాలో 40 సీట్లలో పోటీ అంటేనే ఆశ్చర్యంగా ఉంది.

గతంలోనే జనసేనతో పొత్తుకు చంద్రబాబు లవ్ ప్రపోజల్ పంపారు. దానికి ఇంతవరకు డైరెక్టుగా పవన్ అసలు సమాధానమే ఇవ్వలేదు. పైగా ఇంతకాలం టీడీపీతో పొత్తుకు రెడీ అని అర్ధమొచ్చేట్లుగా సంకేతాలు కూడా ఇచ్చారు. అలాంటిది హఠాత్తుగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ప్రకటించటం ఏమిటో పవన్ కే తెలియాలి. ఇవన్నీ చూసిన తర్వాత పవన్లో కన్ఫ్యూజన్ తారాస్ధాయిలోనే ఉన్నట్లు అర్ధమైపోతోంది. మరీ కన్ఫ్యూజన్ ఎప్పటికి క్లియరవుతుందో ఏమో.
Tags:    

Similar News