అప్పట్లో జేపీ, పవన్.. ఇప్పుడు ఏచూరి

Update: 2016-07-29 07:21 GMT
ఒకేలాంటి హెచ్చరిక ఒకరి నుంచి కాక తరచూ రావటం ఏ మాత్రం మంచిది కాదు. అది భవిష్యత్ పరిణామాలకు ఒక సంకేతంగా చెప్పాలి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి గళం విప్పినోళ్లు చాలా కొద్దిమందే. అయితే.. ఈ సందర్భంగా మేధావిగా చెప్పుకునే జయప్రకాశ్ నారాయణ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఇష్టం వచ్చినట్లుగా విభజన చేయటం ద్వారా కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందని.. ఏపీ వాదనను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకపోవటంపై భవిష్యత్ లో ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుందంటూ ఆయన హెచ్చరిస్తూ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఏపీ వాదనను.. ఏపీ ప్రజల ఆకాంక్షను పట్టించుకోని వైనం.. అక్కడి భవిష్యత్ తరాల్ని ప్రభావితం చేసి.. రేపొద్దున ఈ దేశంలో మేమెందుకు భాగస్వామ్యం కావాలన్న భావన కలిగే ప్రమాదం పొంచి ఉందని.. అలాంటి పరిస్థితి తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు.

జేపీ లాంటి వ్యక్తి నోటి నుంచి ఈ తరహా మాటలు రావటం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆ తర్వాత ఇంచుమించు ఇదే తరహా వ్యాఖ్యల్ని జనసేన పార్టీ అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చాయి. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకుండా ప్రమాదకరమని.. అది అశాంతిగా మారి.. మరో ఖలిస్థాన్ ఉద్యమం లాంటిది ఎక్కడ పుట్టుకొస్తుందోనన్న భయం తనను వెంటాడుతుందని ఆయన ఒకట్రెండుసార్లు వ్యాఖ్యానించారు.

ఈ ఇద్దరి వ్యాఖ్యలకు తగ్గట్లే తాజాగా మరో సీనియర్ రాజకీయ నాయకుడు.. జాతీయస్థాయిలో పలు పరిణామాల్ని దగ్గర నుంచి చూసిన అనుభవం ఉన్న సీపీఎం నేతల్లో పెద్దోడైన సీతారాం ఏచూరి నోటి నుంచి ఇదే తరహా వ్యాఖ్యలు తాజాగా రావటం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో సాగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్.. బీజేపీ రెండూ హామీ ఇచ్చాయి. రెండేళ్లు గడిచినా ఏమీ చేయలేదు. మీరు ఏమీ చేయకపోతే ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయి. పరిస్థితి దిగజారుతుంది. దీంతో దేశ సమైక్యతకు నష్టం వాటిల్లుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన సందర్భంగా ఏం చేస్తామని హామీ ఇచ్చారో అవన్నీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పట్లో జేపీ.. ఆ తర్వాత పవన్.. తాజాగా సీతారాం ఏచూరి లాంటి వారంతా విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో జరిగే సాగదీత లేనిపోని సమస్యల్ని సృష్టిస్తుందన్న విషయాన్ని చెప్పారు. మరింత మంది నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యల హెచ్చరికలు కేంద్రానికి పట్టకపోవటం గమనార్హం. ఈ నిర్లక్ష్యానికి భవిష్యత్తులో మరెంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో..?
Tags:    

Similar News