క్షణికావేశంలో పోతున్న ప్రాణాలు.. రోడ్డు మీద పడుతున్నకుటుంబాలు..!

Update: 2021-04-17 03:12 GMT
మనసుంటే మార్గముంటుంది అంటారు పెద్దలు. ఏ సమస్యకైనా ఆలోచిస్తే కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. చిన్న చిన్న సమస్యలనూ ఎదుర్కోలేక ఎంతోమంది తనువు చాలిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తల్లిదండ్రులకు గర్భశోకం, పిల్లలు అనాథలుగా ఇలా ఎన్నో కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి.
 
భర్త తిట్టాడని ఒకరు, పిల్లలు లేరని మరొకరు, కూతురితో గొడవ పడి ఇంకొకరు, ప్రేయసి దక్కలేదని ఇలా ఎందరో అకారణంగా ఉసురు తీసుకుంటున్నారు. ప్రేమ విఫలమైతే ఆత్మహత్య, పిల్లలు పుట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు వారిని కన్నవారికి గర్భశోకం తప్పా. అందుకే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎంతటి క్లిష సమస్యలైనా సులువుగా మారుతాయని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు.

ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు ఇలా అందరూ ఉన్నారు. ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడున్న జిల్లాల్లో కరీంనగర్ ముందు స్థానంలో ఉంది. ఇటీవలె క్షణికావేశంలో దాదాపు ఇరవై మంది అకారణంగా ఉసురు తీసుకున్నట్లు సమాచారం. ఏ పరిష్కారానికైనా ఇంకో కోణం ఉంటుంది. అలా చేస్తే తప్పకుండా పరిష్కారం ఉంటుంది. ప్రాణాలు తీసుకుంటే ఏం ప్రయోజనం ఉండదు.

మారిన కాలంతో పాటు మనుషులూ మారాలి. తాము చెప్పినట్లే వినాలి అనే ధోరణి నుంచి కాస్త బయటకు రావాలి. భర్త, భార్య, పిల్లలు ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కుటుంబసభ్యులను మరీ నిరంకుశత్వంగా కాకుండా అందరికీ స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే వారి సమస్యలను ఇంట్లో వారికి చెప్పుకొని పరిష్కరించుకుంటారు.  

కుటుంబసభ్యుల అండ లేకుంటే తీవ్ర ఒత్తడికి లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి చేరుతున్నారు. ఇక పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి. అతి గారాబం, మితిమీరిన ఆంక్షలు రెండూ ప్రమాదమే.ఎంతసేపటికీ వారిని నాలుగు గోడల్లో బంధించకూడదు అంటున్నారు మానసిక నిపుణులు. ఇలా తమ వారే భరోసాగా ఓ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోరు. భార్యభర్తలు, తల్లిందండ్రులు, పిల్లలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. తప్పు నీదే అంటూ వాదించుకోకుండా సమస్య పరిష్కారం చేస్తే ఎన్నో ఆత్మహత్యలు అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News