రూ.400 కోట్ల భూమిని మింగేశారు.. వైసీపీ నేత‌ల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Update: 2021-07-03 16:30 GMT
ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌ల‌పై పెద్ద‌గా అవినీతి ఆరోప‌ణ‌లు రాలేదు. ప్ర‌జా సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్ర‌భుత్వం.. ఎక్క‌డా మచ్చ లేకుండా జాగ్ర‌త్త ప‌డుతోంది. అయితే.. ఉన్న‌ట్టుండి రూ.400 కోట్ల విలువైన భూముల‌ను వైసీపీ నేత‌లు మింగేశార‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

చిత్తూరు జిల్లా పీలేరులో జాతీయ ర‌హ‌దారిని ఆనుకొని ఉన్న ప్ర‌భుత్వ భూమిని వైసీపీ నేత‌లు క‌బ్జా చేశార‌ని టీడీపీ నేత‌ కిశోర్ కుమార్ రెడ్డి అన్నారు. అంతేకాదు.. లేఔట్ చేసి, విక్ర‌యిస్తున్నార‌ని కూడా ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాల‌న్నీ త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. వాటిని త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తామ‌ని కూడా అన్నారు.

పీలేరుతోపాటు చిత్తూరు జిల్లాలోని ప‌లు చోట్ల కూడా ఇలాంటి భూ క‌బ్జాలు సాగుతున్నాయ‌ని అన్నారు. వంద‌లు, వేల కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను కాజేస్తున్నా.. ప్ర‌భుత్వం చూసీచూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. త్వ‌ర‌లోనే మీడియాకు సైతం ఆ స్థ‌లాన్ని చూపిస్తామ‌ని, ప్ర‌భుత్వం వెంట‌నే ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు.

ఈ దందా వెనుక జిల్లాకు చెందిన మంత్రితోపాటు ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నార‌ని, వారి స‌హ‌కారంతోనే ఈ అక్ర‌మం కొన‌సాగుతోంద‌ని అన్నారు. అధికారుల‌ను రాజ‌కీయంగా ఒత్తిడిచేసి.. వారిని స‌రిగా ప‌నిచేయనివ్వ‌ట్లేద‌ని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌క్ష‌ణ‌మే స్పందించి, ఈ విష‌యంలో త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు టీడీపీ నేత న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డి.

ఈ అక్ర‌మంలో తెలుగు దేశం పార్టీ నేత‌ల హ‌స్తం ఉన్నా.. వారిని కూడా వ‌దిలిపెట్టొద్ద‌ని అన్నారు. త‌న ద‌గ్గ‌ర స‌ర్వే నెంబ‌ర్ల‌తో స‌హా వివ‌రాలు ఉన్నాయ‌ని, త్వ‌ర‌లో బ‌య‌ట‌పెడ‌తామ‌ని అన్నారు కిశోర్ కుమార్ రెడ్డి. వైసీపీ ప్ర‌భుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. న్యాయ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. జ‌గ‌న్ త‌న నిజాయితీ నిరూపించుకోవాల‌ని అన్నారు. మ‌రి, దీనిపై ప్ర‌భుత్వం, వైసీపీ నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News