స్కూల్ టీచర్ కి మిలియన్ డాలర్ల ప్రైజ్ .. ఎందుకంటే ?

Update: 2020-12-04 07:50 GMT
భారతదేశంలో క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ విప్లవానికి పునాదివేయడంతోపాటు, బాలికా విద్య ప్రోత్సాహానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఒక మిలియన్ డాలర్ల వార్షిక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 కు విజేతగా నిలిచారు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు 32 ఏళ్ల రంజిత్ ‌సిన్హ్ డిసేల్. ప్రపంచంలోని పది మందితో పోటీ పడి విజేతగా నిలవడమే కాకుండా ,తన బహుమతిలో 50 శాతం నగదును  టాప్-10 ఫైనలిస్టులతో పంచుకుంటానని ఆయన ప్రకటించారు.

బహుమతి డబ్బును పంచుకున్న మొదటి విజేతగా చరిత్ర సృష్టించారని  ప్రముఖ దాత, ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సన్నీ వర్కీ తెలిపారు. రంజిత్‌ లాంటి ఉపాధ్యాయులు క్లైమేట్‌ చేంజ్‌ను నిలువరించడంతో పాటు, శాంతియుతమైన, ధర్మబద్ధమైన సమాజాలను నిర్మిస్తారని, అసమానతలను తొలగించి ఆర్థికవృద్ధితో ముందుకు నడిపిస్తారని యునెస్కో  సహాయ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా జియాన్నిని కొనియాడారు. 2009 లో సోలాపూర్‌లోని పరితేవాడిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు డిసెల్ వచ్చినప్పుడు అదొక శిధిలమైన భవనం.  స్టోర్ రూం ఉండేది.  ఈ పరిస్థితిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న డిసెల్‌  పాఠశాల సంస్కరణకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు బాలికలను పాఠశాలకు రప్పించాలని ధ్యేయంగా పెట్టుకన్నారు. అలాగే  గ్రామంలో  బాల్య వివాహాలను అడ్డుకోవడంపై దృష్టి పెట్టారు. ఆయన కృషి ఫలితంగా 100శాతం బాలికలు హాజరుకావడం మాత్రమే కాదు, గ్రామంలో బాల్య వివాహాలను పూర్తిగా నిలువరించగలిగిన ఘనతను దక్కించుకున్నారు.

విద్యార్థులకు స్థానిక భాషలో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడటం, తరగతి పాఠ్యపుస్తకాలను విద్యార్థుల మాతృభాషలోకి అనువదించడమే కాకుండా, ఆడియో పాఠాలను అందించేందుకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌ లను  తీసుకొచ్చారుమహారాష్ట్రలో క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టిన తొలి పాఠశాలగా డిసేల్ ఆధ్వర్యంలోని స్కూలు నిలిచింది. డిసేల్‌ ప్రతిపాదిత పైలట్ పథకం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడతామని రాష్ట్ర మంత్రిత్వ శాఖ 2017 లో ప్రకటించింది. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్  పాఠ్యపుస్తకాలు క్యూఆర్ కోడ్‌తో రూపొందించాలని 2018లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Tags:    

Similar News