మోడీ ప్రెస్ మీట్ పై ఎట‌కారాల వ‌ర్షం!

Update: 2019-05-18 10:39 GMT
ఐదేళ్లు దేశ ప్ర‌ధానిగా ఉంటూ.. ఒక్కటంటే ఒక్క మీడియా మీట్ లో పాల్గొన‌ని ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీని మీడియా గుర్తుంచుకుంటుంది. తాను కోరిన‌.. తన‌కు న‌చ్చిన వారికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇచ్చే మోడీ మాష్టారు.. ప్రెస్ మీట్ లో మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. పార్టీ కెప్టెన్ అమిత్ షా ఉన్న మీటింగ్ లో పార్టీ సైనికుడైన మోడీ మాట్లాడితే మ‌హా పాప‌మ‌ని చెప్పేసి.. గ‌మ్మున ఉండిపోవ‌టం చూస్తే.. న‌మో తెలివి ఎంతో ఇట్టే అర్థ‌మైపోతుంది.

మోడీ ప్రెస్ మీట్ మీద ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన వారంతా.. ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరుకు కాసింత షాక్ కు గురైనా.. వెంట‌నే స‌ర్దుకున్నారు. సూటిగా సంధించే స‌వాళ్ల‌కు.. అంతే సూటిగా స‌మాధానం ఇస్తే ఆయ‌న న‌రేంద్ర మోడీ ఎందుక‌వుతార‌న్న విమ‌ర్శ వినిపించినా.. ఆయ‌న పెద్ద ప‌ట్టించుకోనుకోండి. ఒక బాలీవుడ్ న‌టుడికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ అంటూ దేశ ప్ర‌ధాని హోదాలో టైమిచ్చి.. బోలెడ‌న్ని మాట‌లు చెప్పే మోడీ.. మీడియా మిత్రుల‌తో మాట్లాడ‌టానికి మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు.

మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అమిత్ షా జ‌వాబిచ్చారు. పార్టీ అధినేత ప‌క్క‌న కూర్చుంటే.. మోడీ లాంటి పార్టీ నేత మాట్లాడ‌టం స‌రికాదంటూ ఆయ‌న తెర మీద‌కు తెచ్చిన ప్రోటోకాల్ మ‌హా సిత్రంగా మారింది. ఇలాంటి కార‌ణాల‌తోనే.. ప్రెస్ మీట్ లో మీడియా తో మోడీ వ్య‌వ‌హ‌రించిన తీరుపై సోష‌ల్ మీడియాలో ఎట‌కారం చేసేసుకుంటున్నారు. అందుకు సంబంధించి శాంపిల్ గా కొన్ని వ్యాఖ్య‌ల్ని చూస్తే..

+  ‘అచ్చే దిన్‌కు చక్కటి నిర్వచ‌నం మోడీ విలేకరుల సమావేశం. ఆయన ఎన్నో ఆశలు పెంచారు. భారతీయులను నిరీక్షింపచేశారు. వారికి ఏం చేయలేక పోయారు.

+  ఆయన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వకుండా 17 నిమిషాలు విలేకరుల సమావేశంలో కూర్చున్నారు. ఆయనకు లిఖిత పూర్వకంగా రాసిస్తే తప్పా, సమాధానాలు ఇవ్వరనుకుంటా!

+  అమిత్ షా విలేక‌రుల స‌మావేశానికి మోడీ  హాజరు..... ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఏం చిత్రం!...’

+  ‘నరేంద్ర మోడీ ఒళ్లు తడువకుండా స్నానం చేశారు’ (ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే 2017లొ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ గురించి న‌రేంద్ర మోడీ ఇలాంటి ట్వీటే చేశారు. అప్ప‌ట్లో ఆయ‌న‌.. ‘ఒళ్లు తడవకుండా రెయిన్‌ కోట్‌ వేసుకొని స్నానం చేయడం మన్మోహన్‌కు తెలుసు’ అని పేర్కొన్నారు)

+  ‘మోదీ విలేకరుల సమావేశంలో ప్రశ్నలన్నింటికీ ఫీల్డింగ్‌ చేసిన అమిత్‌ షా.....జర్నలిస్టులుగా హాజరైన బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపడం మరచిపోకు సుమా

+  ‘మోదీ జీ అభినందనలు. మీ విలేకరుల సమావేశం అద్భుతంగా ఉంది. సగం యుద్ధం చేశారు. వచ్చేసారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం అమిత్‌ షా మీకివ్వొచ్చు. బాగుంది’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. మొత్తంగా చూస్తే మీడియా మీట్ లో మోడీ తీరును ప‌లువురు ఎట‌కారం చేసేయ‌టం క‌నిపిస్తోంది.


Tags:    

Similar News