కష్టానికి సూత్రం పేదలకు చెప్పు నారాయణా!

Update: 2016-08-31 05:04 GMT
మంత్రి నారాయణ చాలా కష్టపడుతున్నారట. ఈవిషయం ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అది విని జనం ఇప్పుడు నవ్వుకుంటున్నారు. మునిసిపాలిటీ , సీఆర్‌డీఏ వ్యవహారాలు చూసే మంత్రిగా, అమరావతి నిర్మాణ బాధ్యతలు మొత్తాన్ని తన భుజస్కంధాల మీద మోస్తున్న నాయకుడిగా కష్టపడిపోతున్నానని ఆయన చెప్పుకున్నా కూడా కనీసం జనం నమ్ముతారేమో.. అలా కాకుండా తన వ్యక్తిగత జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతున్నానని ఆయన సెలవిచ్చారు. దీంతో కష్టపడి మరీ నెలకు కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నానని అర్థం వచ్చేలా ఆయన మాటలున్నాయని జనం అనుకుంటున్నారు.

మంత్రి నారాయణ పరోక్షంలో కూడా సాగిపోయే నారాయణ విద్యా సంస్థల వ్యాపారంతోనే ఆయన వర్ధిల్లుతున్నారనేది జనంలో ఉన్న నమ్మకం.  అంతవరకు బాగానే ఉంది. అయితే అక్కడేదో తాను చెమట చిందించేస్తున్నట్లుగా మంత్రిగారు వక్కాణించేసరికి జనంలో జోకులు మొదలవుతున్నాయి. అందులో లాభాలన్నీ తాను కష్టపడి సంపాదిస్తున్నవని చెబుతుండడం వారు నవ్వుకోడానికి ఒక కారణం అవుతోంది.
 
అందుకే అసలే లెక్చరర్‌ అయిన నారాయణ, తాను పడుతున్న సదరు కష్టానికి సూత్రమేదో రాష్ట్రంలో ఉన్న కడుపేదలకు కూడా వెల్లడించినట్లయితే.. పేదరికం మొత్తం తొలగిపోతుంది కదా! పొద్దస్తమానం.. రోజుకు పద్నాలుగు గంటలైనా ఎర్రటి ఎండలో సైతం సెగలు కక్కే పొ లాల్లో ఒళ్లొంచి కష్టపడే కడుపేదలు, ఇంకా అలాంటి అనేక మంది.. నారాయణ పడుతున్న పాటి కష్టాన్ని ఓర్చుకోలేరా? కాబట్టి.. తనకు వందల కోట్లు ఆర్జించి పెడుతున్న కష్టసూత్రాన్ని నారాయణ వారికి వివరిస్తే బాగుంటుందని జనం కోరుకుంటున్నారు.

అయినా.. ఇక్కడ నారాయణ ఒక మెలిక పెట్టారు. నిజానికి అది కూడా విమర్శలకు గురవుతున్నదే. నిబంధనలకు లోబడి అని సెలవిచ్చారు. అక్కడ వియ్యంకులు అయిన గంటా వారు.. రాష్ట్రంలో విద్యకు - విద్యా సంస్థలకు సంబంధించిన నిబంధనలను తయారు చేస్తుంటారు అనేది జనం లో ఉన్న నమ్మకం. ఆ నిబంధనల ప్రకారం.. నారాయణ కష్టపడి వందల కోట్లు సంపాదించేస్తుంటారనేది జనంలో సాధారణంగా వినిపిస్తుండే ఆరోపణ. మరి తమ సంపాదనకు అనుకూలంగా తామే చట్టాలు  - నిబంధనలు తయారు చేసుకుని, ఆ నిబంధనలను అడ్డగోలుగా వాడుకుంటూ.. కోట్లు దండుకునే కష్టానికి ఇంకో పేరు ఏమైనా ఉంటుందా నారాయణ గారూ.. అనేది జనం అడుగుతున్న ప్రశ్న. రాష్ట్ర ప్రజలంతా అభివృద్ధి చెందడానికి ఆ సీక్రెట్‌ లను మీరు వెల్లడిస్తేనే బాగుంటుందంటూ.. జనం నవ్వుకుంటున్నారు మరి!!
Tags:    

Similar News