ఫైర్ బ్రాండ్ డిమాండ్.. కేటీఆర్ పేరును మార్చాలట

Update: 2020-07-29 10:50 GMT
ఆవేశం మంచిదే. కానీ.. దానికి ఒక హద్దు ఉంటుంది. వీరావేశంతో చెలరేగిపోయే వారితో వచ్చే ఇబ్బందేమంటే.. వారి చర్యల పుణ్యమా అని.. మరిన్ని సమస్యల్నికొని తెచ్చుకోవటమే అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కరోనాతో తల్లడిల్లుతున్న వేళ.. ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఏ మాత్రం జీర్ణించుకోలేనివిగా మారుతున్నాయి.

సచివాలయాన్ని కూల్చి వేత ఉదంతం కానీ.. ఉస్మానియా దవాఖానాను కూలగొట్టాలన్న యోచన కానీ.. వీటిని అత్యధికులు తప్పు పడుతున్నారు. ఇలాంటి వేళలోనే.. తాము చేసిన పనుల్ని గొప్పగా చిత్రీకరించటానికి కేసీఆర్ కు చెందిన మీడియా సంస్థలు వినిపిస్తున్న కొన్ని వాదనలు మేలు కంటే చేటే ఎక్కువ చేస్తున్నాయి. నిన్నటికి నిన్న తెలంగాణ సచివాలయాన్ని కూల్చే అంశాన్ని తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసిన వైనాన్ని.. ‘ఆంధ్రా వలస పాలనకు ప్రతీక పతనం’ అంటూ తమ సొంత మీడియా లో రాసుకోవటం పెద్ద తప్పుగా చెబుతున్నారు.

సచివాలయాన్ని కూల్చివేతను సమర్థించుకోవాలన్నప్పుడు ఏదో పాయింట్ తో సమర్థించుకోవచ్చు. అందుకు భిన్నంగా మధ్యలోకి మళ్లీ ఆంధ్రా పేరును.. ఆంధ్రా వలసపాలన అంటూ సంబంధం లేని అంశాల్ని తీసుకురావటంతో చర్చ మరో వైపుకు వెళ్లే పరిస్థితి. అయినా.. తెలంగాణ సచివాలయంలో పూర్తిగా నేలమట్టం చేసిన జీ బ్లాక్.. మొత్తం నిజాం నిర్మించిన భవనం. ఒక రకంగా చెప్పాలంటే.. నిజాం పాలనకు ప్రతీకగా చెప్పే చారిత్రక సాక్ష్యంగా జీ బ్లాక్ ను చెప్పాలి. అదేమీ చేయకుండా.. కూల్చటానికి అడ్డదిడ్డమైన వాదనను తెర మీదకు తేవటం ద్వారా తెలంగాణ అధికారపక్షం తప్పు మీద తప్పు చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

ఇలాంటివేళ.. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కమ్ ఎంపీ రేవంత్ రెడ్డి గళం విప్పారు. నిజంగానే కేసీఆర్ ఆంద్రా ఆనవాళ్లను చెరిపేయాలంటే ముందుగా తన కుమారుడు కేటీఆర్ పేరును మార్చాలన్నారు. మరి.. కేటీఆర్ పేరును తీసేస్తారా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. పేరు మార్చటం వల్ల పెద్దగా నష్టం ఉండదని. . ఒక నోటిఫికేషన్ ద్వారా మార్చుకోవచ్చని చెబుతున్నారు. ఆంధ్రా ప్రతీక గా మారిన పేరు విషయం లో సీఎం కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారు? అన్నదిప్పుడు ప్రశ్న గా మారింది. ఇదంతా ఎవరి వల్ల వచ్చిన తలనొప్పులు అంటే.. తన తరఫున వాదనను వినిపించేందుకు పెట్టుకున్న వారి ముందుచూపు లేమిగా చెబుతున్నారు. కేసీఆర్ కు విధేయులు గా ఉన్న వారి అత్యుత్సాహం ఇప్పుడు కొత్త తిప్పలు తెచ్చి పెడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News