రేవంత్ రెడ్డి మాట మారుతోంది..?

Update: 2016-05-02 11:10 GMT
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్లు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణలో వైసీపీని టీఆరెస్ లోకి విలీనం చేయడంపై విమర్శలు గుప్పించిన ఆయన ఇప్పటికీ టీఆరెస్ పట్ల తనకున్న వ్యతిరేకతను చాటుకున్నారు. అయితే.. అదే సమయంలో రేవంత్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కొత్త చర్చలకు , సందేహాలకు తావిస్తున్నాయి. తెలంగాణకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్ పైనా పోరాడుతానని ఆయన ప్రకటించారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది తమ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అని తెలిసి కూడా రేవంత్ ఆ స్థాయిలో వ్యాఖ్యానించారంటే దాని వెనుక మతలబు ఏమిటా అన్న చర్చ జరుగుతోంది.

టీటీడీపీ నేతలంతా ఇప్పటికే టీఆరెస్ లో చేరిపోయారు. రేవంత్ మాత్రం ఓటుకు నోటు కేసు నేపథ్యంలో టీఆరెస్ తో కుస్తీ పడుతున్నారు. ఈ దశలో తెలంగాణ టీడీపీ పూర్తిగా బలహీనపడినా కూడా రేవంత్ గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీలోనే కొనసాగుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు - లోకేశ్ లు తెలంగాణల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో ఉండడం రాజకీయంగా ఆత్మాహత్యా సదృశమేనని నేతలు భావిస్తున్నారు.

అయితే.. అందరిలా రేవంత్ టీఆరెస్ లో కి వెళ్లే అవకాశాలు లేవు. దీంతో ఆయనేమైనా కొత్తగా పార్టీ పెట్టి ఏపీపై పోరాడుతారా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒక దశలో ఆయన బీజేపీలోకి వెళ్తారని అనుకున్నా కూడా ప్రస్తుతం టీడీపీ - బీజేపీలు మిత్రపక్షాలు కావడంతో అక్కడకు వెళ్లి ఆయన ఏపీతో పోరాడలేరు. దీంతో రేవంత్ ఏదో కొత్త ఆలోచన చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. రెడ్లను ఏకం చేసి ఆయన కొత్త పార్టీ పెట్టే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా వినిపిస్తోంది. ఏదేమైనా కూడా రేవంత్ వ్యాఖ్యలు యథాలాపంగా అన్నవి కావని.. దాని వెనుక నిగూడార్థం ఉందని అంటున్నారు. మరి... రేవంత్ వ్యాఖ్యలను చంద్రబాబు ఎలా స్వీకరిస్తారో చూడాలి.
Tags:    

Similar News