జగన్ దీక్ష చేయటం చీకటి ఒప్పందమేనట

Update: 2016-05-04 10:30 GMT
విమర్శలు చేయటంలో తప్పు లేదు. కానీ.. తాము చేసే విమర్శలు ఎంతోకొంత  అర్థవంతంగా ఉండటమే కాదు.. చెప్పే మాటలో లాజిక్ తప్పనిసరి. కానీ.. అలాంటివి తెలంగాణ తెలుగుదేశంపార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిలో కాస్త మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన తెలంగాణ అధికారపక్షంతో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. దివంగత వైఎస్ ఆత్మ కేసీఆర్ లో ఆవహించిందని.. ఈ కారణంగానే ప్రాజెక్టులను రీ డిజైన్ చేస్తున్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

కేసీఆర్ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల మీద తాము మాట్లాడితే తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటున్నట్లుగా టీఆర్ ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లుగా రేవంత్ ఆరోపించారు. ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు కాంట్రాక్టులు అప్పగించేందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్.. వైఎస్ జగన్ మీద చేసిన విమర్శల్లో లాజిక్ లేదన్న మాట వినిపిస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి రూ.10వేల కోట్ల రూపాయిల ప్రాజెక్టులు అప్పగించిన విషయం నిజం కదా? అని రేవంత్ ప్రశ్నించారు. మరి.. కర్నూలులో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో ధర్నా చేస్తున్నారు కదా అని మీడియా ప్రశ్నలు సంధిస్తే.. అదంతా చీకటి ఒప్పందంలో భాగమని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రేవంత్ ఆరోపించినట్లుగా జగన్ పార్టీ ఎంపీకి రూ.10వేల కోట్ల ప్రాజెక్టు కట్టబెడితే జగన్ కిక్కురమనకుండా ఉండాలే కానీ నిరసన దీక్ష చేయకూడదు కదా? ఒకవేళ.. జగన్ ఎంపీకి ప్రాజెక్టు ఇచ్చిన తర్వాత కూడా జగన్ నిరసన దీక్ష చేయటమంటే.. అంతకు మించిన పెద్ద విషయం ఏం ఉంటుంది? తన పార్టీకి చెందిన నేతకు భారీ ప్రాజెక్టు వచ్చినా.. దానికి వ్యతిరేకంగా తానే స్వయంగా రంగంలోకి దిగి నిరసన దీక్ష చేస్తానని చెప్పటం అంత చిన్న విషయం కాదు కదా. రెండు వేర్వేరు విషయాల్ని కలగలిపే ప్రయత్నం రేవంత్ ఎక్కడో ఏదో తప్పటడుగు వేసినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News