వెల్ లోకి వచ్చే సభ్యులకు అలా చెక్ చెబుతారా?

Update: 2020-02-21 05:00 GMT
అసెంబ్లీ.. శాసనమండలి.. లోక్ సభ.. రాజ్యసభ.. వేదిక ఏదైనా కావొచ్చు.. ప్రజాప్రతినిధులు వ్యవహరించే తీరు.. వారి రాజకీయం కోసం విలువైన సభా కాలాన్ని ఏ రీతిలో వేస్ట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సభ్యుల్ని ఎంత చెప్పినా.. వారి తీరు మార్చుకోని పరిస్థితి. ‘‘ముందు క్వశ్చన్ అవర్ కానివ్వనీయండి.. మీరు కోరిన అంశం మీద చర్చ జరపుదాం’’ అని ఎంత చెప్పినా తగ్గని మొండితనం.. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరించటం.. సభ జరగకుండా ఉండేలా చేయటం లాంటివి తరచూ చూస్తాం.

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సభల్ని కొలువు తీర్చటమన్న విషయమే నిజమైతే.. బల ప్రదర్శన కాకుండా అర్థవంతమైన చర్చలతో సమస్యల్ని ప్రస్తావించటం మంచిది. కానీ.. పొలిటికల్ మైలేజీ కోసం సభను ముందుకు సాగనివ్వకుండా చేసే రచ్చకు చెక్ పెట్టే ప్రయత్నం ఒకటి మొదలైంది. పెద్దల సభలో త్వరలో అమలు చేయాలని భావిస్తున్న ఈ నిర్ణయం నిబంధనగా మారితే మాత్రం.. సభ స్వరూపం మారే వీలుందని చెప్పక తప్పదు.

ప్రజా సమస్యలు.. విధానాలపై చర్చలు జరిగే సందర్భంలో సభ్యులు అదే పనిగా వెల్ లోకి దూసుకెళ్లటం.. నినాదాలు చేయటం.. నిరసనలు చేపట్టటం లాంటి వాటి విషయంలో సభ్యుల తీరుపై మరిన్ని పరిమితులు విధించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా చేస్తున్న ఆలోచన ప్రకారం వెల్ లోకి వచ్చి సభ కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించే సభ్యుల్ని బిల్లులపై ఓటింగ్ కు అనర్హులుగా చేసే ప్రతిపాదనపై సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఒకవేళ.. ఇది కాస్తా రూల్ గా మారితే మాత్రం రాజ్యసభ నడిచే తీరులో మార్పు ఖాయం. ఇదే విధానాన్ని లోక్ సభ.. రాష్ట్రాల్లోని అసెంబ్లీ.. శాసనమండలిలోనూ అమలు చేస్తే మంచిదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News