రజినీకాంత్ రాజకీయ అరంగ్రేటం.. పాతికేళ్ల నిరీక్షణ

Update: 2020-12-06 15:30 GMT
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలలే ఉన్న వేళ హఠాత్తుగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం ప్రకటన చేయడం తమిళ రాజకీయాలను షేక్ చేసింది. నాడు ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారం సాధిస్తే.. నేడు రజినీకాంత్ నాలుగైదు నెలల్లోనే అధికారం దిశగా పార్టీ స్థాపిస్తున్నారు. ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉన్న రజినీకాంత్ సక్సెస్ అవుతాడా? దాదాపు 25 ఏళ్ల నిరీక్షణ తర్వాత రజీనీకాంత్ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాడన్నది ఆసక్తిగా మారింది..

రజనీకాంత్ 2021 జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ఆయన అభిమానులు రజనీకాంత్ పార్టీ అధికారిక ప్రకటన కోసం 1990 నుంచీ ఎదురుచూస్తుండడం విశేషం.

రజనీకాంత్  చేసిన ఈ ప్రకటన  సంచలనమైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి సరిగ్గా 6 నెలల ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని, దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్‌ 31న వెల్లడిస్తానని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తాము ఆధ్యాత్మిక లౌకిక రాజకీయాలనే కొత్త పంథాలో నడవనున్నట్టు తెలిపారు.

గత అక్టోబర్‌లో అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాలేనంటూ రజనీకాంత్‌ పేరిట రాసిన ఒక లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.  ఆ లేఖలో పేర్కొన్నట్టుగా అనారోగ్య సమస్యలు తనని వేధిస్తున్నాయని, కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ అవడంతో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే వరకు సమూహాలకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారని అప్పట్లోనే చెప్పారు.  

 తొలిసారిగా రజనీకాంత్ రాజకీయ అంశాల గురించి 1995లో పెదవి విప్పారు. ఎంజీఆర్ కళగం పార్టీ అధ్యక్షుడు ఆర్ఎం వీరప్పన్ హాజరైన ఒక సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ... తమిళనాడులో బాంబుల కల్చర్ పెరిగిపోయిందని, దీనికి తమిళనాడు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు.

  అప్పట్లో పీవీ నరసింహరావు భారత ప్రధానిగా ఉన్నారు. మూపనార్ అనే తమిళ కాంగ్రెస్ నేత 1996లో కాంగ్రెస్ నుంచీ బయటకు వచ్చి, తమిళ మానిల కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఏడీఎంకే పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ మూపనార్ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి, తమిళ్ మానిల కాంగ్రెస్ స్థాపించి డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు.

రజనీకాంత్ డీఎంకే కూటమికి బహిరంగంగా తన మద్దతు ప్రకటించారు. ఆయన ఒక రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించడం అదే తొలిసారి. అప్పటి ఏడీఎంకే ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. ఈ విజయంలో రజనీకాంత్ పాత్ర కూడా ఉందని, ఆయన బహిరంగంగా మద్దతు తెలపడం సానుకూల ఫలితాలనిచ్చిందని పలువురు భావించారు. ఎన్నికల సమయంలో రజనీకాంత్ అభిమానులు డీఎంకే కూటమికి మద్దతుగా నిలుస్తూ తమ సహాయ సహకారాలు అందించారు.

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు డిసెంబర్ 31, 2017న ప్రకటించారు రజినీకాంత్. అయితే తాను కొత్త పార్టీ పెడతానని కానీ, వేరే పార్టీలో చేరతానని కానీ అప్పుడు ఆయన చెప్పలేదు. ఆ తరువాత రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేందుకు కూడా ప్రయత్నించలేదు. లోక్‌సభ ఎన్నికలు తమకు ప్రాధాన్యం కాదని ప్రకటించారు. అయితే మరికొన్ని నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించి తమిళనాడు రాజకీయాల్లో రజినీకాంత్ వేడి పుట్టించారు.
Tags:    

Similar News