చలానా సొమ్ముతో ఫ్రీగా హెల్మెట్లు

Update: 2019-09-06 05:27 GMT
ఆసక్తికర వ్యాఖ్య చేశారు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. కొత్త వాహన చట్టం అమలు నేపథ్యంలో భారీగా చలానాలను కొన్నిరాష్ట్రాల్లో విధిస్తున్నారు. కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు..మరికొన్ని రాష్ట్రాల మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. అలా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్లు లేకుండా వాహనాన్ని నడిపే వారికి రూ.వెయ్యి చొప్పున జరిమానాను విధిస్తున్నారు. ఈ భారీ ఫైన్ల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అక్కసును వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని ప్రకటనను రాజస్థాన్ సీఎం చేశారు.

భారీ మొత్తంతో వసూలుచేస్తున్న చలానాల మొత్తంతో తమ ప్రభుత్వం హెల్మెట్లను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై విధించే జరిమానాలతో వారికి ఉచితంగా హెల్మెట్ ను కొనుగోలు చేసి ఇస్తామన్నారు. అంతేకాదు.. ఇకపై కులం పేరును.. ఊరి పేరును వాహన నెంబరు ప్లేట్ల మీద వేయకూడదన్నారు.  

కులం.. వృత్తులు.. సంస్థలు.. హోదాలను వాహనాలపైన ప్రదర్శించటంతో సమాజంలో కులతత్త్వంతో పాటు బేధాభిప్రాయాలు ఎక్కువ అవుతాయన్నారు. తాజాగా ఆయన పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. వాహనదారులు ఎవరూ తమ సంస్థల పేర్లు.. హోదాలను వ్యక్తిగత వాహనాలపై ప్రదర్శించకుండా చూడాలని రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా ఆదేశాల్ని జారీ చేసింది. ఇదే తీరును.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయటం మంచిదని చెప్పక తప్పదు. 
Tags:    

Similar News