పోలింగ్ రియాక్షన్స్.. ఎవరి భాష్యం వారిది!

Update: 2019-04-13 01:30 GMT
పోలింగ్ కు ముందు కూడా ఎవరికి వారు తమదే విజయం అని విశ్వాసంతో చెబుతూ వచ్చారు. తాము విజయం సాధించి తీరడమే తరువాయి అని.. అటు తెలుగుదేశం వారు - ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు సవాళ్లు విసురుతూ వచ్చారు. వివిధ సర్వేలు బయటకు వచ్చినా.. నేతల కాన్ఫిడెన్స్ లెవల్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఎవరికి వారు  తమదే విజయం అని చెబుతూ వచ్చారు.

ఇక పోలింగ్ అనంతరం కూడా వీళ్లు ఎక్కడా తగ్గకపోవడం విశేషం. పోలింగ్ తర్వాత ఎవరు ఏం చెప్పినా  పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే.. కాన్ఫిడెన్స్ ను కనబరిస్తే నాలుగు సీట్లు పెరుగుతాయనే లెక్కలేమీ ఉండవిప్పుడు. అయినా నేతలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.

అందులోనూ ఏపీలో ఈ సారి పోలింగ్ పర్సెంటేజ్ బాగా నమోదు అయ్యింది. ఎనభై శాతం దరిదాపుల్లో ఓట్లు పోల్ అయ్యాయనే అంచనాలున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇది పెరిగినట్టే. ఇలాంటి పరిణామాల్లో ఇది ఎవరికి అనుకూలంగా మారుతుంది.. అనేది ఆసక్తిదాయకంగా మారింది.

పరిశీకుల ఆసక్తి అలా ఉంటే.. రాజకీయ పార్టీల నేతలు మాత్రం పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ కూడా తమకే అనుకూలమని చెబుతూ ఉన్నారు.  పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం తమకు అనుకూలమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. సాధారణంగా అధికారంలో ఉండిన వారిపై వ్యతిరేకత ఉన్నప్పుడే పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని, అధికారంలో ఉన్న వారిని గద్దె దింపేందుకు అంతా వచ్చి ఓటేస్తారనేది ఒక సిద్ధాంతం. అదే అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ తమకే అనుకూలమని అంటోంది. తమది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంటున్నారు.

ఇక ఈ మాటల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏమీ తీసిపోవడం లేదు. తాము ఘన విజయం సాధిచండం ఖాయమని తెలుగుదేశం పార్టీ అంటోంది. పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ నే ఆ పార్టీ కూడా ఉదాహరణగా పేర్కొంటూ ఉంది. పోలింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగిందని.. అది తమకు అనుకూలమని తెలుగుదేశం అంటోంది.

తాము భారీ ఎత్తున సంక్షేమ పథకాలను అమలు పరిచినట్టుగా, అందుకే తమకే ఓట్లు పడినట్టుగా తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ప్రత్యేకించి మహిళలు - వృద్ధులు తరలి వచ్చి ఓట్లు వేశారని అందుకే తమదే విజయమని తెలుగుదేశం అంలటోంది.

ఇలా ఇరు  పార్టీలూ ఒకే వాదన వినిపిస్తూ ఉన్నాయి. ఎవరికి వారు తమదే పై చేయి అని అంటున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇరు వర్గాలూ ఒకే ధీమాతో ఉన్నాయి.
Tags:    

Similar News