మోడీ ముందు చూపుకు జ‌య‌హో!!

Update: 2022-07-25 00:30 GMT
ఏమాట‌కు ఆమాటే చెప్పుకోవాలి. రాజ‌కీయాల‌న్నాక‌.. ముందు చూపు చాలా ముఖ్యం. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో.. ముందుగానే ఊహించి దానికి త‌గిన విధంగా అడుగులు వేయ‌డం నాయ‌కుల‌కు ముందుగా రావాల్సిన విద్య‌. ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చాలా ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించార‌ని.. అంటున్నారు మేదావులు. ఇప్ప‌టికి ఆయ‌న రెండు సార్లు.. కేంద్రంలో చ‌క్రం తిప్పారు. వ‌రుస‌గా ప్ర‌ధాని పీఠం అధిరోహించారు. అనేక చ‌ట్టాలు చేశారు. ముఖ్యంగా బీజేపీ సిద్ధాంతాల్లో కీల‌క‌మైన ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును సాధించారు. అయోధ్య రామాల‌యం క‌ట్టిస్తున్నారు.

పార్ల‌మెంటు కొత్త భ‌వ‌నం పూర్తి చేస్తున్నారు. ఇలా.. దూకుడుగా ఉన్న మోడీ.. ముచ్చ‌ట‌గా మూడో సారి కూడా విజ‌యం ద‌క్కించుకుని.. బీజేపీ జెండాను మ‌రోసారి రెప‌రెప‌లాడించాల‌ని భావిస్తున్నారు. అయితే.. ఎంతైనా.. రెండు సార్లు మోడీ  ప్ర‌భుత్వ పాల‌న చూశాక‌.. ప్ర‌జ‌ల‌కు మొహం మొత్తే ఛాన్స్ ఉండ‌నే ఉంటుంది. అందుకే ఆయ‌న‌.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముందుచూపుతోనే రాష్ట్ర‌ప‌తిని ఎంపిక చేశారు. ఇదీ.. ఇప్పుడు మేధావి వ‌ర్గం చెబుతున్న విష‌యం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి ద్రౌపది ముర్ము  విజయం కలిసొస్తుందని అంటున్నారు మేధావులు.

2024లోనే కాదు ఈ ఏడాది జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2023లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రయోజనం పొందనుందని అంటున్నారు. దేశ వ్యాప్తంగా రాబోయే రెండేళ్లలో 18 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లోనూ ముర్మును రాష్ట్రపతి  చేసిన అంశం మేలు చేయబోతోందని పరిశీలకుల అంచనా.  ఇదంతా మోడీ ముందుగానే ఊహించార‌నేది మేదావ‌లు టాక్‌.  

దేశవ్యాప్తంగా 8.9% ఆదివాసీ ఓటర్లున్నారు.  మొత్తం 47 లోక్‌సభ స్థానాల్లో ఆదివాసీల ఓట్లే అత్యంత కీలకం. రిజర్వేషన్ల పరంగా ఈ 47 సీట్లు ఆదివాసీలకు కేటాయించేవే. 2019లో ఈ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 31 స్థానాలను గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆదివాసీల ఓట్లను పొందడంలో భారతీయ జనతా పార్టీ నేతలు విఫలమయ్యారు. అయితే ముర్మును రాష్ట్రపతిని చేయడం ద్వారా ఈసారి ఆదివాసీల్లో సెంటిమెంట్ నెలకొనడం ఖాయమని, అది తమకు మేలు చేస్తుందని మోడీ అంచనా వేస్తున్నారు. ఆదివాసీలకు పెద్దపీట వేయడంతో పాటు వారి అభివృద్ధికి కట్టుబడి ఉండే పార్టీ తమదేనని బీజేపీ నేతలు బలంగా ప్రకటించుకుంటున్నారు.

ఇది తొలి విజ‌యం!

ఇటీవల జ‌రిగిన‌ రాష్ట్రపతి ఎన్నికల్లో  విపక్షాల్లో కూడా విపరీతంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. 17 మంది వివిధ పార్టీలకు చెందిన విపక్ష ఎంపీలు ముర్ముకు ఓటేశారు. ఇది మోడీ సాధించిన తొలి విజ‌యంగా చెబుతున్నారు. వంద మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు కూడా ముర్ముకు ఓటేసి రాష్ట్రపతిగా గెలిపించారు. తాము ఆదివాసీలకు వ్యతిరేకం కాదని ఆయా పార్టీలు చెప్పుకోవాల్సిన పరిస్థితిని మోడీ క‌ల్పించారు. 2024 ఎన్నికల్లోనూ ఆదివాసీల సెంటిమెంట్ బలంగా కొనసాగుతోందని కమలనాథులు విశ్వాసంగా ఉన్నారు.  మొత్తానికి మోడీ ముందు చూపుపై చాలానే విశ్లేష‌ణ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News