దయచేసి ఇలాంటి లవ్ ట్రాక్ లకు ట్రై చేయొద్దు

Update: 2021-06-19 03:16 GMT
ప్రేమించుకోవటం ఓకే. కానీ.. ప్రేమను గెలిపించుకోవాలని తపించటానికి మించిన తప్పు మరేం ఉంటుంది. ప్రేమ అన్నది సహజసిద్ధంగా ఇద్దరు వ్యక్తుల మధ్య రావాలి కానీ.. జీవితాంతం కలిసి ఉండాలన్న కచ్ఛితమైన రూల్ పెట్టుకొని.. అందుకు వినూత్నంగా ప్రయత్నించిన ఈ జంట ప్లాన్ వర్కువుట్ కాలేదు. మొదట్లో బాగున్నట్లు అనిపించినా.. కాలం గడిచే కొద్దీ వారి ప్లాన్ వారికే నచ్చలేదు. అందుకే గడువు ముగిసిన వెంటనే ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా విడిపోయిన వైనం ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.

కోట్లాది ప్రేమలు ఉన్నా.. వీరి ప్రేమకథ గురించి తెలుసుకోవాల్సిన స్పెషల్ ఏముందంటారా? అక్కడే ఉంది అసలు విషయం. వీరి వింత ప్రేమకథలోకి వెళితే.. ఉక్రెయిన్ కు చెందిన 33 ఏళ్ల అలెగ్జాండర్.. 29 ఏళ్ల విక్టోరియాలు తమ జీవితంలో చాలా సందర్భాల్లో బ్రేకప్ లు ఎదుర్కొన్నారు. అందుకే.. ప్రేమను నిలుపుకోవటానికి సరికొత్త ప్రయత్నం చేశారు.

ఆన్ లైన్ లో కార్లను అమ్మే ఉద్యోగం చేసే అతగాడు.. బ్యూటీషియన్ అయిన విక్టోరియాతో కలిసి ఉండాలని డిసైడ్ అయ్యారు. మిగిలిన ప్రేమికులకు భిన్నంగా వారిద్దరూ చేతికి సంకెళ్లు వేసుకొని జీవించాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమను ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ జంట చేతికి సంకెళ్లు వేసుకొంది. మరి.. బాత్రూంకు వెళ్లాలంటే? అన్న సందేహం రావొచ్చు. అక్కడికి కూడా జంటగానే వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఇద్దరు ఇద్దరి చేతులకు కలిపి వేసుకున్న సంకెళ్లతో వారి లవ్ జర్నీ స్టార్ట్అయ్యింది. మొదట్లో చాలా ఎగ్జైటింగ్ గా ఉండేది. కానీ.. రోజులు గడిచేసరికి అది కాస్తాపోయి.. ఎప్పుడెప్పుడు బేడీల నుంచి బంధ విముక్తులం అవుతామని ఎదురుచూశారు. 123 రోజుల సంకెళ్ల బంధానికి ఫుల్ స్టాప్ పెట్టిన వీరు.. బేడీలు చేతులకు వీడిపోయినంతనే ఎవరి దారి వారు చూసుకోవటం గమనార్హం.

మొదట్లో బాగానే ఉందని.. కానీ తర్వాత బాగా ఇబ్బందిగా అనిపించినట్లు చెప్పుకొచ్చారు. ఒక ప్లస్ కనిపించినా.. ఆ వెంటనే రెండు మైనస్ లు కనిపించేవని.. సంకెళ్లు వీడిన తర్వాత స్వేచ్ఛ లభించినట్లుగా ఇరువురు ఫీల్ కావటం గమనార్హం. ప్రేమ అన్నది సంకెళ్లతో బంధిస్తే రాదు.. దానికది సహజంగా రావాలే కానీ.. బలవంతంగా బంధిస్తే ఎక్కువ కాలం ఉండదన్న విషయం వీరి అనుభవంతో  మరోసారి స్పష్టమైందని చెప్పాలి.
Tags:    

Similar News