బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఫొటో వార్

Update: 2021-10-15 00:30 GMT
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య మరోసారి నిప్పు రాజేసే ఘటన చోటుచేసుకుంది. ఈరెండు పార్టీలకు కొద్దికాలంగా పడడం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలతో నాయకులు ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటున్నారు. తాజాగా ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు నువ్వానేనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి విభేదాలే బయటపడ్డాయి. ఇందుకు అమీర్ పేట ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవం వేదికైంది.

హైదరాబాద్ అమీర్ పేట్ లో ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోటోకాల్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటీపోటీగా నినాదాలు చేశారు. ఆస్పత్రి ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇక్కడ 50 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునాతన సౌకర్యాలతో ఈ ఆస్పత్రిని నిర్మించారు.

మరోవైపు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన శిలాఫలకం మీద ప్రోటోకాల్ ప్రకారం కిషన్ రెడ్డి పేరు ముందుగా లేదని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపు టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య పోటీపోటీ నినాదాలు చేశారు. పరస్పరం నినాదాలతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు. ఈ కార్యక్రమం నుంచి కిషన్ రెడ్డి, తలసాని మాట్లాడకుండానే వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది.

అమీర్ పేట మాజీ కార్పొరేటర్ శేషు కుమారి తన అనుచరులతో టీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో ప్రసంగించకుండానే కిషన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెనుదిరిగారు.
Tags:    

Similar News