అక్కడ ఎన్నికలపై పెద్ద ఆసక్తే లేదా!

Update: 2019-04-16 07:13 GMT
లోక్ సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ కు సంబంధించిన ప్రచారానికి నేటితో తెర పడనుంది. నేటి సాయంత్రంతో ఎక్కడిక్కడ మైకులు బంద్ కానున్నాయి. రేపు ప్రచారానికి పూర్తి విరామం. ఎల్లుండి గురువారం పోలింగ్ జరగబోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజకీయ పార్టీలు ప్రచారంలో అమీతుమీగా తల పడుతూ ఉన్నాయి.

గత గురువారం తొలి విడత ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా వారానికి రెండో దశ పోలింగ్ కూడా పూర్తి కాబోతోంది.

ఈ దశలో దక్షిణాదిన కర్ణాటకలోనూ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో ఎంపీ సీట్ల పోరు  ఆసక్తిని రేపుతూ ఉంది. అక్కడ కాంగ్రెస్ –జేడీఎస్ లు పొత్తుతో బరిలోకి దిగాయి. భారతీయ జనతా పార్టీ సోలోగా రంగంలోకి దిగింది. ఇటీవలే కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.

కర్ణాటక అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ తరహా తీర్పు వచ్చింది. ముక్కోణపు పోరులో మూడు పార్టీలు తలా కొన్ని సీట్లను పంచుకోగా.. జేడీఎస్- కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతూ ఉండటం - అందులోనూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా అక్కడ పలు ఉప ఎన్నికలు జరగడంతో..  ఈ సారి అక్కడ ఎన్నికలపై మరీ అంత ఆసక్తి కనిపించడం లేదు.

దీంతో పెద్దగా పోల్ పర్సెంటేజీ కూడా నమోదు అవుతుందనే అంచనాలు లేవు. వరసగా ఎన్నికలు వస్తూ ఉండటంతో ప్రజలకు పోలింగ్ పై ఆసక్తి సహజంగానే తగ్గుతుంది కదా. అదే జరుగుతోందక్కడ. రెండో విడతలో కర్ణాటకలోని పదిహేడు ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. కొంతమంది సెలబ్రిటీలు పోటీలో ఉండటంతో.. బెంగళూరు సెంట్రల్ - మండ్య వంటి నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తిని రేపుతోంది. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం ఆ ఊపు కనిపించడం లేదు!
Tags:    

Similar News