వారి మీద పవన్ అంత ఎఫెక్ట్ చూపించారా?

Update: 2016-08-31 09:26 GMT
మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉన్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం బీజేపీ మీద బాగా పడినట్లుగా కనిపిస్తోంది. తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ తాలూకు సెగ ఢిల్లీని తాకినట్లుగా చెబుతున్నారు. తాజాగా కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ.. సుజనాలతో భేటీ అయిన బీజేపీ చీఫ్ అమిత్ షా పవన్ ప్రస్తావనను తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేకహోదా అంశంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందన్న వాదనను అమిత్ షా వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చేయాల్సిన ప్రకటన జారీలో జరిగే ఒక రోజు ఆలస్యం కూడా పార్టీని ప్రభావితం చేస్తుందని.. పార్టీ ఇమేజ్ కు నష్టం వాటిల్లుతుందంటూ చెబుతున్న మాటలు చూస్తే.. పవన్ ఎఫెక్ట్ ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. స్నేహితులుగా ఉన్న వారు శత్రువులుగా మారుతున్నారని.. హోదాపై వెనువెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

హోదాపై ప్రకటన ఆలస్యమయ్యే కొద్దీ మిత్రులుగా ఉన్న వారు శత్రువులుగా మారుతారని.. బీజేపీకి ఇదేమాత్రం మంచిది కాదన్న అమిత్ షా మాట పవన్ ను ఉద్దేశించిందని చెబుతున్నారు. తిరుపతిలో నిర్వహించిన సభలో అమిత్ షా ప్రస్తావన తీసుకకురావటం మర్చిపోకూడదు. తనను బీజేపీ అధినేత అమిత్ షా కలిశారని.. ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని.. బీజేపీలోకి రావాలంటూ ఆయన కోరారని.. తాను అందుకు తిరస్కరించినట్లుగా చెప్పారు. అమిత్ షానే స్వయంగా పవన్ ను పార్టీలో చేరాలని అడగటమంటే..ఏపీలో పవన్ కున్న ఫాలోయింగ్ ఏమిటో ప్రత్యేకించి చెప్పాలసిన అవసరం లేనట్లే. మరోవైపు పవన్ ఎలాంటి నేతన్నది అమిత్ షా లాంటి వారికి ఇప్పటికే తెలుసు. మిత్రుడిగా ఉంటూ ఎలాంటి రాజకీయ లబ్థి కోరని పవన్ లాంటోడి కారణంగా పార్టీకి జరిగే నష్టాన్ని ఆయన అంచనా వేయగలరు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్.. తిరుపతి బహిరంగ సభలో బీజేపీపై నిప్పులు చెరగటం.. తన ప్రసంగాన్ని ముగించే క్రమంలో తెలుగులో చెబితే అర్థం కావటం లేదంటూ.. హిందీ.. ఇంగ్లిషులో చేసిన తీవ్ర భావోద్వేగ ప్రకటన అమిత్ షాకు బాగానే తాకిందంటున్నారు. ఎగువన ఉన్న ఢిల్లీకి.. కిందన ఉన్న దక్షిణాది అస్సలు కనిపించటం లేదన్న పవన్ పవర్ ఫుల్ మాట బీజేపీ చీఫ్ పై ప్రభావం చూపించిందని చెబుతున్నారు. ఈ కారణంతోనే ఏపీ హోదా అంశంపై తీసుకోవాల్సిన నిర్ణయాన్ని వెనువెంటనే తీసుకోవాలన్న మాట ఆయన నోటి నుంచి వచ్చిందని చెప్పొచ్చు.
Tags:    

Similar News