ఇప్పుడూ ప్రశ్నించవా పవన్ కల్యాణ్..?

Update: 2016-07-30 06:51 GMT
ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. విభజన కారణంగా దారుణంగా దెబ్బతింటున్న ఏపీకి అండగా నిలిచేందుకు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నాటి యూపీఏ సర్కారు తీరును ప్రశ్నించేందుకు.. తెలంగాణ ప్రజలకు దన్నుగా నిలిచేందుకు వీలుగా పవన్ పార్టీ పెట్టారు. తెలుగు ప్రాంతాల్లోని ప్రజల పక్షాన నిలవటమే తన ధ్యేయంగా చెప్పుకున్న పవన్.. ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టినట్లుగా పలుమార్లు చెప్పుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీతో భేటీ అయిన పవన్.. తర్వాత ఎన్డీయే కూటమికి ఓటు వేయాల్సిందిగా చెప్పారు. మోడీ ప్రధానిగా.. చంద్రబాబు ఏపీ సీఎంగా అయితే ఏపీ ప్రజల స్థితిగతులు మారతాయంటూ ఆయన చెప్పారు. ఆయన కోరినట్లే.. కేంద్రంలో మోడీ ప్రధానిగా.. రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా అయ్యారు. తన మాటల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు  తాను అండగానిలుస్తానని చెప్పిన పవన్.. అందుకు తగ్గట్లే పలుమార్లు తళుక్కున మెరిసారు.

తన అవసరం ఉందన్న భావన కలిగిన ప్రతిసారీ తెర మీదకు వచ్చిన పవన్.. ఆయా అంశాల మీద తన గళాన్ని విస్పష్టంగా వినిపించారు. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ మొదలు పెట్టిన చంద్రబాబు సర్కారు.. తమ మాట వినని కొన్ని గ్రామాలపై భూసేకరణ అస్త్రాన్నిప్రయోగించేందుకు సిద్ధమైనప్పుడు.. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టటం.. అందుకు స్పందనగా ఈ అంశం మీద పలు గ్రామాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్.. రైతులు తమంతట తాము భూములు ఇచ్చేలా ప్రభుత్వం వ్యవహరించాలే కానీ.. ఇష్టం లేకుండా బలవంతంగా భూములు తీసుకోవటాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని.. భూసేకరణను తక్షణం నిలిపివేయాలంటూ అల్టిమేటం విధించటం.. అందుకు తగ్గట్లే ఏపీ సర్కారు వ్యవహరించటం గమనార్హం.

ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశంపై తాను దృష్టి పెట్టానని.. అవసరమైన సమయంలో తాను ఈ అంశంపై స్పందిస్తానని చెప్పిన పవన్.. తాజాగా ఎందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నిస్తున్నారు. ఓపక్క ప్రత్యేక హోదా అన్నది లేదని జైట్లీ తేల్చి చెప్పిన నేపథ్యంలో.. పవన్ ఎందుకు గళం విప్పటం లేదని.. ఎందుకు ప్రశ్నించరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్లుగా చెప్పిన పవన్ కల్యాన్.. ఏపీకిప్రత్యేక హోదా లేదంటూ రాజ్యసభలో కుండబద్ధలు కొట్టేసిన తర్వాత కూడా ఎందుకు మౌనంగా ఉన్నట్లు? ఆయన ప్రశ్నించరా?
Tags:    

Similar News