ఇలాంటి మాటలు తలసాని మాత్రమే చెప్పగలరు

Update: 2020-10-20 09:50 GMT
కంటి ముందు కనిపించే నిజాన్ని సైతం అబద్ధంగా చెప్పటం.. బల్ల గుద్ది వాదించే దమ్ము ధైర్యం.. అందరు నేతలకు ఉండదు. కానీ.. అలాంటివేమీ లేకుండా నోటికి అనిపించిన మాటను.. అధినేత మనసుల్ని దోచుకునేట్లుగా మాట్లాడే ఆర్ట్ తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసానికి టన్నుల లెక్కన ఉంటుందని చెప్పాలి. గడిచిన వారం రోజులుగా హైదరాబాద్ మహానగరాన్ని ఉక్కిరిబిక్కరి చేస్తున్న భారీ వర్షాలు.. వరదలతో ఎంత నష్టం జరిగిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చిన్న పిల్లాడు సైతం హైదరాబాద్ వరదలకు కారణం అడిగితే.. అక్రమ నిర్మాణాలు అని చెప్పేస్తాడు. కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ మాదిరి ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలు.. అధికారులతో పాటు.. వాటి కారణంగా ప్రయోజనాలు పొందేటోళ్ల పుణ్యమా అని ఈ రోజున కోటికి పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. మంత్రి తలసాని నోటి నుంచి వచ్చిన మాటలు విన్నోళ్లు అవాక్కు అయ్యే పరిస్థతి.

ఇంతకీ ఆయన చెప్పేదేమంటే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. అందునా కేసీఆర్ సర్కారు హయాంలో అక్రమ నిర్మాణమే జరగలేదని చెబుతున్నారు. 2014 తర్వాత జరిగిన నిర్మాణాల్ని చట్ట పరిధిలోనివే అని ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ ఇప్పుడు షాకింగ్ గా మారింది. ప్రస్తుతం వరదల్లో మునిగిన నిర్మాణాలు.. ప్రస్తుతం విమర్శలు చేస్తున్న నాయకులు హయాంలోనివేనని వ్యాఖ్యానించారు.

చరిత్రలో ఎన్నడూ చూడని వర్షాలు కురిసాయని.. అదో చరిత్రఅన్న ఆయన.. వరద ముంపునకు గురైన ప్రాంతాల వారికి నష్ట పరిహారం ప్రకటించినందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను థ్యాంక్స్ చెప్పినట్లుగా చెబుతున్నారు. గడిచిన ఆరేళ్లలో ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చేసి.. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరగటం.. దానికి సంబంధించిన భవంతులు హైదరాబాద్ లోని ప్రతి వీధిలోనూ దర్శనమిచ్చే పరిస్థితి. కంటికి కనిపించే నిజాన్ని సైతం అబద్ధంగా చెప్పే టాలెంట్ తలసానికి మాత్రమే సాధ్యమేమో. ఒకవైపు మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలపై అందరిది సమాన బాధ్యత ఉందంటూ మాట్లాడిన దానికి భిన్నంగా తలసాని చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఇంతటి బరితెగింపు మాటలు ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News