ఆత్మకూరులో మేకపాటితో తలపడేదెవరు?

Update: 2022-05-26 03:28 GMT
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సహృదయుడిగా, మృదు స్వభావిగా పేరున్న మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆత్మకూరులో పోటీ చేసే అభ్యర్థులెవరనే దానిపై ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అధికార వైఎస్సార్సీసీ తరఫున మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి లేదా గౌతమ్ భార్య శ్రీకీర్తి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. మేకపాటి విక్రమ్ రెడ్డి వైపే ఆయన కుటుంబమంతా మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. తన సోదరుడు గౌతమ్ రెడ్డి మాదిరిగానే ప్రజలతో ఆప్యాయంగా కలసిపోతున్నారు.

దీంతో ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు, తదితర పార్టీల నుంచి ఎవరూ పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు.

ఏదైనా నియోజకవర్గంలో ఎవరైనా చనిపోతే పోటీ పెట్టకుండా వారి కుటుంబ సభ్యులనే ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఏపీలో ఉంది. అయితే.. బద్వేలులో అధికార పార్టీ ఎమ్మెల్యే మరణించినప్పుడు అక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసింది. అయినా గెలుపు అధికార పార్టీనే వరించింది.

ఈ నేపథ్యంలో ఆత్మకూరులో కూడా జనసేన, టీడీపీ, కమ్యూనిస్టు, తదితర పార్టీలు పోటీ చేయబోవని తెలుస్తోంది. బీజేపీ మాత్రం గతంలో మాదిరిగానే పోటీ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. కాగా, ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. జూన్ 6 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 9ని చివరి తేదీగా పేర్కొన్నారు. జూన్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 26న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియను జూన్ 28లోగా పూర్తి చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
Tags:    

Similar News