గీత దాటనంటున్న మాజీ మంత్రి...జగన్ టికెట్ ఇస్తారా...?

Update: 2023-01-25 08:46 GMT
నెల్లూరు రాజకీయాలు అంటేనే చాలా టఫ్ గా ఉంటాయి. ఎందరో ఉద్ధండులు అక్కడ నుంచి రాజకీయం చేస్తూ వచ్చారు. చాలా పెద్ద రాజకీయ కుటుంబాలు అక్కడ చక్రం తిప్పుతూ ఉంటాయి. వారి వత్తిడిని తట్టుకుని నెగ్గడం అంటే కష్టమే. ఏదో ఒక ఎన్నికతో గెలిచి మంత్రి అయినంత మాత్రాన సుదీర్ఘ రాజకీయం సాగించినట్లు కాదు. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం పెద్ద తలకాయలు తన గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇపుడు అదే బాధ ఆవేదన మరో నేతలో ఉంది. ఆయన యువ కిశోరంగా వైసీపీలో ఒకనాడు చలామణీ అయ్యారు. మూడేళ్ళ పాటు కీలకమైన జలవనరుల శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆయనే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఆయన 2014లో ఓడారు, 2019లో గెలిచారు వెంటనే మంత్రి అయ్యారు. అయితే మంత్రి అయిన కాలంలో ఆయన పోకడలే ఇపుడు ఇబ్బందిగా మారాయని నిష్టురమైన విమర్శ ఉంది.

అది ఆయన ఎంతవరకూ అంగీకరిస్తారో తెలియదు కానీ ఇపుడు ఆయనకు నిన్నటిదాకా తోడున్న వారే లేరు అన్నది నగ్న సత్యంగా మారింది. దాంతో తట్టుకోలేకపోతున్నారు. గడప గడపకూ తిరుగుతూ అదే టైం లో మీడియా ముందు ఏదో టైం లో తన బాధను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తనకు టికెట్ రాకుండా చేస్తున్నారు అని ఈ మధ్య తరచూ అంటున్న అనిల్ కుమార్ తాను ఎలా టికెట్ సాధిస్తానో చూడండి అని సవాల్ కూడా చేస్తున్నారు.

తాను జగన్ ముందే తల వంచుతాను అని ఆయన గీచిన గీత దాటను అని అనిల్ చెప్పుకున్నారు. జగన్ తోనే తన జీవితం అని ఆయన అంటున్నారు. మరి ఇన్ని విధాలుగా ఆయన చెబుతున్నా కూడా జగన్ టికెట్ ఇస్తారా అన్నదే ఇక్కడ చూడాలి. అనిల్ కి సొంత బాబాయ్ నుంచే వైరం మొదలైంది. అనిల్ గెలుపులో వెన్నంటి ఉన్న బాబాయ్ సొంత దుకాణం లా వైసీపీ పార్టీ ఆఫీస్ తెరచారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే అని ప్రచారం చేసుకుంటున్నారు.

ఇక గతంలో అనిల్ కి అండగా ఉన్న మాజీ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డిని కూడా ఆయన మంత్రి అయ్యాక దూరం చేసుకున్నారని అంటున్నారు. ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితో వైరం ఎటూ ఉంది. ఈ నేపధ్యంలో సర్వేలు కూడా ఆయనకు వ్యతిరేకంగా వస్తున్నాయి. మరి వాటి ప్రాతిపదికనే టికెట్లు ఇచ్చే జగన్ తన భక్తుడిని అని చెప్పుకునే అనిల్ కి ఉత్త పుణ్యానికే టికెట్ ఇస్తారా అన్నదే చర్చ. గెలవకపోతే అనిల్ అయినా మరొకరు అయినా టికెట్ ఇచ్చే సమస్యే ఉండదు అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే మంత్రి పదవి పోయాక అనిల్ కి అసలు సంగతులు తెలుస్తున్నాయి, తత్వం బోధపడుతోంది అని అంటున్నారు. ఆ మధ్యన ఆయన తనకు మంత్రి పదవి తీసేసి జగన్ మంచి పని చేశారని, తన వారు ఎవరో ప్రత్యర్ధులు ఎవరో తెలుసుకునే అవకాశం వచ్చింది అని చెప్పుకొచ్చారు. ఇపుడు జగన్నే నమ్ముకున్నాను అని అంటున్నారు. ప్రజలు తన వెంట ఉన్నారని కూడా అంటున్నారు. మొత్తానికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తారాజువ్వగా ఎగిసిన అనిల్ ఇపుడు పల్లాన్ని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కి పార్టీ గెలిచి ఏదైనా పదవి వస్తే అసలైన అనిల్ మళ్ళీ బయటకు వస్తారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News