మాణిక్యం హుషారు.. మామూలుగా లేదట

Update: 2020-09-29 09:10 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా ఈ మధ్యనే ఎంపిక చేసిన మాణిక్యం ఠాగూర్ వ్యవహారశైలి పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటివరకు ఇంఛార్జీలకు భిన్నంగా ఆయన ధోరణి ఉందంటున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు మామూలోళ్లు కాదు. వారందరిని సమన్వయం చేయటం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయంపై తనకు అవగాహన ఉందన్న విషయాన్ని తన మాటలతో.. చేతలతో చెప్పేస్తున్నారు మాణిక్యం.

పార్టీలో ఎవరికి ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నా.. అందరూ పార్టీ నిర్ణయాల్ని శిరసా వహించాల్సిందేనని స్పష్టం చేసిన ఆయన.. పార్టీయే సుప్రీం అన్నారు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా అన్ని స్థాయిల్లో నేతలు కట్టుబడి ఉండాలని చెబుతున్నారు. 2023 నాటికి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటమే తమ మిషన్ అన్న ఆయన.. అదేమీ కష్టసాధ్యం కాదన్నారు.

అధికారానికి రెండు అడుగుల దూరంలోనే ఉన్నామని చెప్పిన ఆయన.. అందుకు కారణం లేకపోలేదన్నారు. ప్రతి పదేళ్లకు ఒకసారి రాష్ట్రాల్లో అధికారం మారుతూ ఉంటుందని.. 2023 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామన్నారు. గడిచిన మూడు రోజులుగా పార్టీకి చెందిన పలువురు నేతలతో తాను మాట్లాడానని.. వారి నుంచి సానుకూల ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ తీరు వేరుగా ఉంటుందన్న ఆయన.. ప్రాంతీయ పార్టీల తరహాలో ఉండదన్నారు.

తమకు కొన్ని పద్దతులు ఉంటాయని.. అభ్యర్థి ఎంపిక కంటే కూడా గెలుపే ముఖ్యమన్నారు. పార్టీ పరంగా తెలంగాణలో పరిస్థితిని అవగాహన చేసుకుంటానని చెప్పిన మాణిక్యం.. తెలుగును ఏడాదిలో నేర్చుకోవాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న తీరు చూస్తే.. ఇన్నాళ్లకు సరైన సమన్వయకర్త పార్టీకి దొరికినట్లుగా చెప్పక తప్పదు. వారానికి మూడు పదాల చొప్పున నేర్చుకుంటున్నానని.. చెప్పిన ఆయన తన లక్ష్యసాధన ఏ రీతిలో ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

పీసీసీ అధ్యక్షుడి మార్పు లాంటి వాటి గురించి వ్యాఖ్యలు చేయటానికి ఏ మాత్రం ఇష్టపడని ఆయన.. ఆచితూచి మాట్లాడే ధోరణి కనిపిస్తుందని చెప్పాలి. తెలంగాణ.. తమిళనాడు రాజకీయాలు వేరుగా ఉన్నాయన్నది ఆయన భావన. రెండు ప్రాంతాలకు చెందిన ప్రజల్లో భావోద్వేగాలు ఎక్కువని.. అదే సమయంలో రాజకీయాల్లోనూ తేడా ఉంటుందని చెప్పారు. తమిళనాడు మోడల్ తెలంగాణకు సూట్ కాదన్నారు. మొత్తానికి తన పరిధి ఏమిటో పూర్తి అవగాహనతో పాటు.. తనకున్న పరిమితులు ఏపాటివన్న విషయాన్ని తన మాటలతో.. చేతలతో చెప్పేస్తున్న మాణిక్యం తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News