ఒక్క మాటలో పవన్ కు రోజా చెక్

Update: 2021-11-30 09:32 GMT
ఏపీలోని అధికార వైఎస్సార్ సీపీలో ఫైర్ బ్రాండ్ నేత చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ మీద, వైఎస్సార్ సీపీలో ఉంటూ ఇప్పుడు చంద్రబాబు మీద ఆమె చేసే విమర్శలు, సెటైర్లు భలే ప్రాచుర్యం పొందాయి. 2014-19 మధ్య వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పడు రోజా ఎంతటి సంచలనం రేపారో అందరికీ తెలిసిందే. ఆమెను కట్టడి చేయడానికి నాటి అధికార టీడీపీ చేయని ప్రయత్నం లేదు. అయినా, వాటన్నిటినీ ఛేదించుకుని రోజా ప్రజల్లోకి వెళ్లేవారు. దీనికితోడు వివిధ చానళ్లలో ఆమె చేస్తున్న కార్యక్రమాలు రోజాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

మంత్రి పదవిపై కన్నేసి..

ఏపీలో వచ్చే సంక్రాంతికి మంత్రివర్గ ప్రక్షాళన జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం జగన్ తన ప్రమాణ స్వీకారం సందర్భంగానూ రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. దీని లెక్కన చూస్తే దాదాపు ఆ సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో చాలామంది ఆశావహులు పదవిపై కన్నేశారు. సీఎం జగన్ చెప్నినట్టు, 90 శాతం మంత్రులను పక్కనబెడితే.. ఆశావహుల్లో పలువురికి చాన్స్ దక్కొచ్చు. అలాంటివారిలో రోజా ఒకరు.

సామాజిక సమీకరణాలతో చేజారిన అవకాశం

చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే కావడమే రోజాకు మంత్రి పదవి దక్కకపోవడానికి కారణమైంది. ఈ జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ కావడం తో ఆయననే మినిస్టర్ గిరీ వరించింది. ఒకే సామాజిక వర్గం కావడంతో రోజాకు అవకాశం లేకపోయింది. మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విప్ గా ఉండడంతో ఆ పదవీ దక్కలేదు. దీంతో రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు.

ప్రక్షాళనపై ఆశలు

ఎంతైనా మంత్రి పదవి మంత్రి పదవే. ఈ నేపథ్యంలో రోజా తాజా ప్రక్షాళనలో మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా దక్కుతుందని ధీమాగానూ ఉన్నారు. వాస్తవానికి రోజా ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి. అలాంది కొంత కాలంగా ఆమె పెద్దగా హడావుడి చేయడం లేదు. దీనికి నగరి నియోజకవర్గంలో జరిగిన కొన్ని పరిణామాలే కారణమని కూడా తెలుస్తోంది.

టీవీ చర్చలో జగన్ ను పొగిడి

ఇటీవల రోజా ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ ను ఆకాశానికెత్తారు. ఎప్పటిలాగానే జగన్ ప్రభుత్వ పనితీరు.. సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను కొనియాడారు. నాయకుడిగా జగన్ గొప్పదనాన్ని మెచ్చుకున్నారు. అదే సమయంలో ఇంటర్వ్యూయర్ .. పవన్ కల్యాణ్ గురించి రోజాను అడిగారు. 2024 ఎన్నికల్లో జగన్ ను ఓడిస్తానంటూ పవన్ చేసిన సవాల్ ను ప్రస్తావించారు. దీనికి రోజా తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇంటర్వ్యూయర్ ప్రశ్నకు ఒక్క మాటలో సమాధానమిచ్చారు.
4

ఓడించండం కాదు.. ఆయనను గెలవమనండి

2024 ఎన్నికల్లో జగన్ ను ఓడించడం కాదు.. సొంతంగా గెలిచి చూపాలని పవన్ కల్యాణ్ కు రోజా సూచించారు. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్లా ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని తీసుకుని వైసీపీ అభిమానులు పవన్ అభిమానులను గేలి చేస్తున్నారు. అలా.. 2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోవడం పవన్ కు ఆయన అభిమానులకు చివరకు జనసేన పార్టీకి ఓ చేదు అనుభవంలా మిగలడమే కాక వెంటాడుతూ వస్తోంది. వైసీపీ నాయకులు, అభిమానులకు అదే పెద్ద ఆయుధంగా మారింది.


Tags:    

Similar News