ఈటల భూకబ్జాపై మెదక్ కలెక్టర్ సంచలన స్టేట్ మెంట్

Update: 2021-12-06 10:30 GMT
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ అసైన్డ్ భూములను కబ్జా చేసింది వాస్తవమే అని మెదక్ కలెక్టర్ హరీష్ వెల్లడించారు. 70.33 ఎకరాలు కబ్జా చేసినట్లు సర్వేలో తేలిందని చెప్పారు.

ఈటల భూముల అంశంపై కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘56 మంది అసైన్డ్ దారుల భూములను ఈటల కబ్జా చేసినట్లు తేలిందని’ కలెక్టర్ ప్రకటించారు.

అచ్చంపేట, హకీంపేట పరిధిలో అసైన్డ్ భూముల కబ్జా జరిగిందని కలెక్టర్ తెలిపారు. జమునా హేచరీస్ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసిందని.. అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుకున్నారని తెలిపారు. అనుమతులు లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మించారని తెలిపారు. నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.

ఈటల రాజేందర్ వాల్టా చట్టాన్ని ఉల్లంగించి అటవీ ప్రాంతంలో చెట్లు నరికి, రోడ్లు వేశారని.. పౌల్ట్రీ కాలుష్యం వెదజల్లుతున్నట్టు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. అసైన్డ్ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై నివేదిక పంపామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై, సహకరించిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

బాధిత అసైనీలకు న్యాయం చేసేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కలెక్టర్ తెలిపారు.దీంతో భూకబ్జా విషయంలో ఈటల రాజేందర్ కు ఉచ్చు బిగుసుకున్నట్టే కనిపిస్తోంది.


Tags:    

Similar News