వెతికి మ‌రీ 30 ఏళ్ల నాటి బాకీ తీర్చేసిన ఎంపీ!

Update: 2019-07-09 07:35 GMT
చేసిన సాయాన్ని మ‌ర్చిపోతున్న రోజులివి. న‌మ్మినోళ్ల‌ను న‌ట్టేట ముంచుతున్న పాడు కాలం. అలాంటివేళ అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం తాను చేసిన అప్పును గుర్తు పెట్టుకొని మ‌రీ తీర్చేందుకు దేశం కాని దేశానికి వ‌చ్చిన‌  వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ ఆ ఎంపీ ఎవ‌రు?  ఆయ‌న అప్పు ఎందుకు తీసుకున్నారు?  అప్పు తీర్చేందుకు 30 ఏళ్లు ఎందుకు ప‌ట్టింది? అన్న అంశాల్లోకి వెళితే..

కెన్యా పార్ల‌మెంటేరియ‌న్.. విదేశీ వ్య‌వ‌హారాల స‌మితి అధ్య‌క్షుడు రిచ‌ర్డ్స్ న్యాగ‌క టోంగీ. ఇప్పుడంటే ఇంత పెద్ద పొజిష‌న్లో ఉన్నారు కానీ.. 30 ఏళ్ల క్రితం ఆయ‌న పరిస్థితి వేరు. 1985 నుంచి 1989 వ‌ర‌కు మ‌హారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉంటూ మౌలానా అజాద్ కాలేజీలో చ‌దువుకునేవారు. కాలేజీ స‌మీపంలో ఒక గ‌దిలో అద్దెకు ఉండేవారు.

రూమ్ కు ద‌గ్గ‌రే ఒక కిరాణా షాపు ఉండేది. అక్క‌డే రోజువారీ వ‌స్తువులు తీసుకునేవారు. అలా ఒక‌సారి రూ.200 స‌రుకులు అప్పుగా తీసుకున్నారు. అనుకోకుండా స్వ‌దేశానికి వెళ్లిపోవ‌టంతో అప్పు తీర్చ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత కెన్యా రాజ‌కీయాల్లోకి వెళ్లిన ఆయ‌న పార్ల‌మెంటేరియ‌న్ స్థాయికి ఎదిగారు. అయిన‌ప్ప‌టికీ తాను చేసిన అప్పును తీర్చ‌లేక‌పోయాన‌న్న బాధ రిచ‌డ‌ర్డ్స్ ను వెంటాడేది.

తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసేందుకు కెన్యా ప్ర‌తినిధి బృందం ఒక‌టి భార‌త్ కు వ‌చ్చింది. అందులో టోంగీ కూడా ఉన్నారు. మోడీని క‌లిసిన త‌ర్వాత ఆయ‌న నేరుగా ఔరంగాబాద్ కు చేరుకున్నారు. తాను అప్పు చేసిన వ్యాపారి ఆడ్ర‌స్ ను అతి క‌ష్ట‌మ్మీద తెలుసుకున్నారు. 30 ఏళ్ల క్రితం తాను చేసిన రూ.200 అప్పున‌కు బ‌దులుగా 250 యూరోలు (రూపాయిల్లో 19,200) తిరిగి ఇచ్చేశారు. ఈ సంద‌ర్భంగా వారంతా పాత స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు.


Tags:    

Similar News