మోతె డెవలప్‌ కాకపోతే కేసీఆర్‌ పరువు పోతుందట

Update: 2015-07-06 08:29 GMT
మనసు దోచుకునేలా మాట్లాడటంతో తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మించిన వారు ఎవరూ ఉండరన్న విషయం తెలిసిందే. పరిసరాల్ని చెత్తగా ఉంచుకోకూడదన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఆ విషయాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పేందుకు.. దోమలు సోషలిస్టులు అని.. అవి ఎవరికి భయపడవని.. మంత్రి.. ముఖ్యమంత్రి ఎవరినైనా కుట్టిపారేస్తాయని చెప్పి అందరి మనసు దోచుకున్న కేసీఆర్‌.. తాజాగా తన సొంతూరు మోతెలో పర్యటించారు.

తాజాగా తెలంగాణ సర్కారు నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని సొంతూరులో జరిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చెట్లు నాటిన కేసీఆర్‌.. చెట్టు లేకపోతే భవిష్యత్తు లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మోతెను అభివృద్ధి చేయలేకపోతే పోయేది తన పరువేనని కేసీఆర్‌ చెప్పటంతో అక్కడి స్థానికులు కేరింతలు కొట్టారు. గ్రామంలో ఉన్న సమస్యల చిట్టాను తెలుసుకున్న ఆయన.. వాటిని అక్కడికక్కడే నిర్ణయాలు తీసేసుకోవటం గమనార్హం.

అధికారంలోకి వచ్చిన పదమూడు నెలలకు సొంతూరు గుర్తుకు రావటం.. సొంతూరు అభివృద్ధి చెందకపోతే తన పరువు పోతుందని చెప్పి.. గతాన్ని మర్చిపోయేలా చేసి.. ప్రజల మనసుల్ని దోచుకోవటం కేసీఆర్‌కే సాధ్యమేమో. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విపరీతంగా పొగిడేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News