ఆలస్యం.. అమృతం.. కేసీఆర్ స్ట్రాటజీ?

Update: 2019-11-13 15:05 GMT
ఆలస్యం.. అమృతం.. అనివార్యం.. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తెలంగాణ సీఎం కేసీఆర్ పాటిస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఎన్నో రోజులు చేస్తారో చూస్తూ వారి సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇక రెండోసారి గెలిచాక కేసీఆర్ అన్నీ ఆలస్యం చేస్తుండడం టీఆర్ఎస్ వర్గాల్లో ఓపిక నశించేలా చేస్తోంది.

మే నెలలో కొలువు దీరిన కేసీఆర్ మంత్రివర్గాన్ని మొన్నటి వరకు విస్తరించకుండా కేటీఆర్, హరీష్ లాంటి వాళ్లను దూరం పెట్టి టీఆర్ఎస్ లో ఎంత గందరగోళం రేపారో అందరికీ తెలిసిందే.. ఇక మంత్రి పదవులు భర్తీ కావడంతో నెక్ట్స్ నామినేటెడ్ సందడి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ పదవుల పందేరాన్ని అస్పలు పట్టించుకోవడం లేదు. దీంతో పార్టీని నమ్ముకొని ఉంటున్న నేతల్లో అసహనం పెరిగిపోతోందట..

ఈ ఏడాదిలో కేవలం రెండు మూడు కొత్త కార్పొరేషన్ చైర్మన్లు, మరో ఇద్దరు చైర్మన్ల పదవి కాలాన్నీ మాత్రమే కేసీఆర్ పొడిగించారు. తెలంగాణలో కార్పొరేషన్లు, కమిషన్లు, ఇతర సంస్థలు కలిపి దాదాపు 56 ఉన్నాయి. వాటన్నింటికి చైర్మన్ పదవుల ఎంపిక ఎప్పుడు అని టీఆర్ఎస్ శ్రేణులు ఆశగా చూస్తున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన పదవుల్లో కేవలం టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు, శాప్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి పదవీ కాలం మాత్రమే రెన్యువల్ అయ్యింది. ఇక ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తన చేతిలో గజ్వేల్ లో ఓడిన ఒంటేరు ప్రతాపరెడ్డికి కేసీఆర్ ఇచ్చారు.

దాదాపు 500 వరకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా కేసీఆర్ మౌనంగా ఉండడం.. ఆ కార్పొరేషన్లు, వాటి డైరెక్టర్లను కూడా నియమించకపోవడం గులాబీ దళంలో అసహనం పెంచుతోంది.

మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు దక్కిన నేతలంతా ఇప్పుడు నామినేటెడ్ పదవులపైనే ఆశలు పెంచుకున్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రలు తుమ్మల, జోగురామన్న, లక్ష్మారెడ్డి, సీనియర్లు నాయిని, కడియం, స్వామిగౌడ్ లు కూడా ఎదురు చూస్తున్నా కేసీఆర్ పదవుల భర్తీ ఆలోచనే చేయడం లేదు. ఇక పార్టీనే నమ్ముకొని ఉన్న వారికి కూడా కేటాయించడం లేదు. దీంతో అధినేత నిర్ణయం కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు గులాబీ శ్రేణులు.
Tags:    

Similar News