అవును.. కేసీఆర్ క్షమాపణలు చెప్పారు

Update: 2016-09-27 06:16 GMT
కొంతమంది నుంచి కొన్నింటిని అస్సలు ఊహించలేం. మాటల మరాఠిగా అభివర్ణించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఏదైనా అనుకుంటే... అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటం లేదన్న మాటను అడిగితే..తనదైన శైలిలో ఎదురుదాడి చేస్తారే కానీ సూటిగా.. మాత్రం సమాధానం చెప్పరన్న విమర్శ ఆయనపై ఉంది. అయితే.. అందుకు భిన్నంగా వ్యవహరించిన  కేసీఆర్...  అందరిని ఆశ్చర్యపరుస్తూ క్షమాపణలు చెప్పటం విశేషం.

కేసీఆర్ నోటి నుంచి క్షమాపణలు అన్న మాట రావటం చాలా అరుదని చెప్పాలి. రాజకీయంగా కావొచ్చు.. మరో కారణం చేత కావొచ్చు.. తన కారణంగా తప్పు జరిగిందన్న విషయాన్ని కేసీఆర్ చెప్పటం చాలా అరుదైన అంశంగా చెప్పాలి. అలాంటి ఆయన తాజాగా క్షమాపణలు చెప్పేశారు. అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందన్న విషయాన్ని చూస్తే..

గతంలో తాను వేములవాడ వచ్చినప్పుడు మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇస్తానని హామీ ఇచ్చానని.. కానీ.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఇళ్లు మంజూరు చేసినందుకు డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తనను క్షమించాలని కోరారు. ‘‘మిడ్ మానేరు నిర్వాసితులకు అర్ అండ్ ఆర్ కింద ఇళ్లు మంజూరు చేశాం. కాలనీల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఆడిట్ లో సమస్యలు వస్తుండడంతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వలేం. ఆ రోజు అవగాహన లేక హామీ ఇచ్చా. ఈ విషయమై పెద్ద మనసుతో నన్ను క్షమించాలి. పరిహారాన్ని యుద్ధప్రాతిపదికన చెల్లిస్తాం. డబ్బులు విడుదల చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు. ఇలా ఒకఅంశానికి సంబంధించి ఇంత ఓపెన్ గా కేసీఆర్ సారీ చెప్పటం చాలా అరుదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News