నాయినికి అల్లుడి చిక్కులు

Update: 2015-08-02 04:58 GMT
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు.. బంధువులు చక్రం తిప్పటం మామూలే. తాజాగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడి దందాపై పలు ఆరోపణలు.. విమర్శలు రావటం తెలిసిందే.

ఒక బాకీ వసూలుకు సంబంధించి.. డబ్బులు ఇవ్వాల్సిన వారి పక్షాన అండగా నిలిచి.. అప్పు ఇచ్చిన వారిపై దాడి చేశారంటూ బయటకొచ్చిన ఘటన సంచలనం సృష్టించటం తెలిసిందే. నవీన్.. సుధీర్ అనే వ్యక్తుల నుంచి మయూరి టక్కర్ అనే మహిళ రూ.38 లక్షలు అప్పుగా తీసుకోవటం.. దీనికి సంబంధించిన సెటిల్ మెంట్ కోసం తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని అల్లుడు వద్దకు రావాలని చెప్పి..అక్కడ వారిపై దాడి చేయటంతో మనస్తాపానికి గురైన సుధీర్ అక్కడికక్కడే ఆత్మహత్యా ప్రయత్నం చేయటంతో విషయం కాస్తా రచ్చ కెక్కింది.

బ్లేడ్తో తన గొంతు కోసుకున్న ఘటనతో నాయిని అల్లుడి సెటిల్ మెంట్ల వ్యవహారం బయటకు వచ్చింది. అయితే.. దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నాయిని అల్లుడు చెబుతున్నా.. ఈ విషయం కారణంగా జరగాల్సిన నష్టం జరిగిందని చెబుతున్నారు. ఈ ఇష్యూపై అల్లుడి తీరుపై నాయిని సీరియస్ అయ్యారని.. అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటంతోపాటు.. ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. ఇలాంటివి మళ్లీ జరగకూడదని కేసీఆర్.. నాయినితో చెప్పారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి అల్లుడి పుణ్యమా అని..నాయిని కొత్త తరహా చిక్కుల్ని ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News