ఫోటో కోసం వెనక్కి వచ్చిన కేసీఆర్

Update: 2017-02-22 06:36 GMT
మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కు తీరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్వామి వారికి మొక్కు చెల్లిస్తానని మొక్కుకున్న మొక్కు తీరటం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన మూడేళ్లకు (రెండు మూడు నెలలకు తక్కువ) మొక్కు తీర్చేందుకు భారీ పరివారంతో తిరుమలకు చేరుకున్న ఆయన.. అనుకున్నట్లే ఉదయం అతిధి గృహం నుంచి బయలుదేరారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మొదట పుష్కరిణికి వెళ్లిన ఆయన.. అనంతరం వరహాస్వామిని దర్శించుకున్నారు. అనంతరం బ్యాటరీ కారులో వరహాస్వామి దేవాలయం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

అక్కడ ఆయనకు టీటీడీ సిబ్బంది.. ఆర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తన పరివారంతో కలిసి.. తాను మొక్కుగా ఇచ్చిన ఆభరణాలని తిలకించిన ఆయన.. స్వామివారి దర్శనాన్ని పూర్తి చేసుకున్నారు. అనంతరం ఆయనకు స్వామి వారిని హారతిని రెండుసార్లు ఆర్చకులు అందించారు. స్వామి వారి దర్శనం అయ్యాక బయటకు వచ్చిన కేసీఆర్.. గుడి ముందు ఫోటో దిగాలని భావించారు. అయితే.. హడావుడిలో ముందుకు వెళ్లి పోయిన ఆయన.. తర్వాత ఫోటో గురించి గుర్తుకు వచ్చి.. మళ్లీ వెనక్కి వచ్చి సతీసమేతంగా శ్రీవారి ఆలయం ఎదుట ఫోటో దిగారు.

ఆలయ సమీపంలో మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు గొప్పగా ఉంటాయన్న ఆయన.. ఇరు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లుగా వెల్లడించారు. తనకు.. తన కుటుంబానికి.. సహచరులకు చక్కటి దర్శనాన్ని అందించారన్న కేసీఆర్.. స్వామి వారికి ప్రాంతీయ భావనలు ఉండవన్న వ్యాఖ్య చేశారు. మొత్తానికి శ్రీవారి దర్శనం జరిగిన తీరు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో సంతృప్తికి గురి అయ్యారన్న విషయం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News