అమిత్ షా మాటలు చీప్ అన్న కేసీఆర్

Update: 2016-05-31 07:24 GMT
మామూలుగానే కేసీఆర్ మాట పడటానికి సిద్ధంగా ఉండరు. అలాంటిది ఎవరికి సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటమే కాదు.. అధికారాన్ని చేపట్టటం.. తిరుగులేని రాజకీయశక్తిగా మారిన ప్రస్తుత తరుణంలో ఆయన మాట ఎలా ఉంటుంది? ఆయన తీరు మరెలా ఉంటుందన్నది ఆసక్తికరమే. మామూలుగానే మాట పడేందుకు ఇష్టపడని ఆయన.. తనకు తిరుగులేన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ.. ఎవరైనా ఆయన్ను విమర్శిస్తే ఎలా రియాక్ట్ అవుతారన్నది తెలిసే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది.

ఒక ప్రముఖ మీడియా సంస్థకు కేసీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా బీజేపీ చీఫ్ అమిత్ షా పై సునిశిత విమర్శలు చేయటమే కాదు.. తమపై చేసిన వ్యాఖ్యలకు దెబ్బకు దెబ్బ అన్నట్లుగా సమాధానం చెప్పటం గమనార్హం. ఇటీవల మీడియాతో మాట్లాడిన సందర్భంగా అమిత్ షా.. టీఆర్ ఎస్ గురించి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కేంద్రంలో భాగస్వామ్యం అయ్యేందుకు టీఆర్ ఎస్ ప్రయత్నిస్తుందా? అన్న ప్రశ్నకు.. కేంద్రంలో చేరటానికి టీఆర్ ఎస్ దరఖాస్తు చేయలేదంటే.. కేసీఆర్ కు ఎక్కడో కాలే మాటను చెప్పటం.. అదే మాటను ఇంటర్వ్యూలో ప్రస్తావన సందర్భంగా కేసీఆర్ తనదైన శైలిలోఅమిత్ షాపై మండిపడ్డారు.

కరవు డబ్బులు అడగలేదంటూ అమిత్ షా చెప్పిన మాటలు చీప్ గా ఉన్నాయన్న కేసీఆర్.. ప్రధానిని కలిసి సాయం గురించి అడిగిన విషయం పత్రికల్లో వచ్చినా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి మాటలు మరీ అల్పంగా ఉన్నాయంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తాము కేంద్రంలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా లేమని.. తాము శుభ్రంగా.. స్వతంత్రంగా ఉన్నామన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

2019లో తెలంగాణలో విజయం తమదేనంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. 2019లో అధికారంలోకి రావటం అన్న మాట మాట్లాడటం సోయి లేకుండా చెబుతున్న మాటలే. కేంద్రం తన తొలి మంత్రివర్గ సమావేశంలోనే తెలంగాణ నుంచి ఏడు మండలలాల్ని తొలగించి అన్యాయం చేసినట్లుగా వ్యాఖ్యానించారు. రెండేళ్లు అవుతున్నా.. తమకిచ్చిన హామీల్ని నెరవేర్చలేదని..  హైకోర్టు విభజన జరగలేదని.. ఇదంతా కేంద్రం అసమర్థత.. చేతకానితనం వల్లనే అంటూ అమిత్ షా మీదున్న ఆగ్రహాన్ని తనదైన శైలిలో కేసీఆర్ బదులు తీర్చుకోవటం కనిపించక మానదు.
Tags:    

Similar News