జగన్ కు కేసీఆర్ అలాంటి షాక్ ఇస్తున్నారా?

Update: 2016-05-02 07:01 GMT
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం మీద గళం విప్పి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ తప్పు చేశారా? పాలమూరు మీద నిరసన చేపడతానని ప్రకటించటం ద్వారా లేని కష్టాల్ని కొని తెచ్చుకున్నారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఈ నెల 16 నుంచి 18 వరకు కర్నూలులో పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిరసన దీక్ష చేయనున్నట్లు జగన్ ప్రకటించటం తెలిసిందే. జగన్ మాటతో తెలంగాణ అధికారపక్షం తీవ్ర ఆగ్రహంతో ఉంది.

ఇప్పటివరకూ తమ విధానాల్ని తప్పు పట్టకుండా ఉన్న జగన్.. ఇప్పుడు అందుకు భిన్నంగా గళం విప్పటంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంగా ఉండటమే కాదు.. జగన్ కు భారీ షాక్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ బలం అంతంతమాత్రమేనన్న విషయం తెలిసిందే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా జగన్ పార్టీ పోటీ చేస్తే.. గెలిచింది ఒక ఎంపీ.. మూడు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు (మదన్ లాల్.. తాటి వెంకటేశ్వర్లు) టీఆర్ ఎస్ లోకి జంప్ కాగా.. ఎంపీ పొంగులేని శ్రీనివాసరెడ్డి.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాత్రం జగన్ పార్టీలోనే కొనసాగుతున్నారు.

తాజాగా పాలమూరు పథకంపై జగన్ గళం విప్పిన నేపథ్యంలో.. ఆయనకు షాక్ ఇచ్చే పనిలో భాగంగా.. ఇప్పుడా పార్టీలో కొనసాగుతున్న ఎంపీ.. ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లోకి తీసుకురావటమే కాదు.. పార్టీని విలీనం చేసేలా తెలంగాణ అధికారపక్షం పావులు కదుపుతుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ చాఫ్టర్ క్లోజ్ అయినట్లేనని చెప్పొచ్చు. ఇంతకాలం తమకు అనుకూలంగా ఉన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్ పై.. అవసరానికి తగ్గట్లు తెలంగాణ అధికారపక్షమే నాలుగు మాటల్ని అంటోంది. ఏ రోజూ తెలంగాణ అధికారపక్షంపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చేయక.. చేయక ఒక విమర్శ చేయటం.. దాన్ని సీరియస్ గా తీసుకున్న టీఆర్ ఎస్ వైఖరి కారణంగా తెలంగాణలో తన పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే వారు లేకుండా చేసుకోనున్నట్లుగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి.  ‘గులాబీ కారు’ ఎక్కేందుకు ఎంపీ పొంగులేని శ్రీనివాసరెడ్డి.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇప్పటికే తమ అంగీకారాన్ని తెలిపినట్లుగా చెబుతున్నారు. ఆ మాటే నిజమైతే.. జగన్ కు మరో పెద్ద దెబ్బ తగిలినట్లే.
Tags:    

Similar News