తమిళనాట మరోసారి వేడి రాజుకోనుందా?

Update: 2017-09-20 06:40 GMT
ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో సిగపట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఒక వర్గంగా కలిసిపోగా.. శశికళ సోదరి కుమారుడు దినకరన్‌ మరో వర్గంగా కొనసాగుతూ తమిళ రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. రోజుకో ట్విస్ట్‌లతో థ్రిల్లర్‌ను తలపిస్తోన్న తమిళనాట మరో వేడి రాజుకోనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కావేరి జలాల పంపిణీపై తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇందుకు ఆజ్యం పోస్తోంది.

కర్ణాటకలో జన్మించిన కావేరి ఆ రాష్ట్రం నుంచి తమిళనాడులోకి ప్రవహిస్తుంది. అయితే ఆ నదిపై ఎడాపెడా ప్రాజెక్టులు నిర్మిస్తూ కర్ణాటక ప్రభుత్వం అధిక మొత్తంలో నీటిని ఒడిసిపడుతోంది. కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు నీటిని విడుదల చేయాల్సిందేనంటూ గతంలోనూ సుప్రీంకోర్టు తమిళనాడుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను పాటించడంలో కర్ణాటక ప్రభుత్వం జాప్యం చేసింది. మాకు మిగులు జలాలేమీ లేవని, మా రాష్ట్రంలో సాగునీరు అందక పంటలు పండక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అందువల్ల నీటిని విడుదల చేయలేమని తెగేసి చెప్పింది. దీంతో రెచ్చిపోయిన తమిళ తంబీలు తమిళనాడులోని కర్ణాటక బస్సులపై, వారి ఆస్తులపై దాడులు చేశారు. చర్యకు ప్రతి చర్యగా కన్నడనాట కూడా తమిళులే లక్ష్యంగా అల్లరిమూకలు చెలరేగిపోయాయి. భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చోటు చేసుకున్నాయి. కన్నడ, తమిళ సినీ పరిశ్రమలకు చెందినవారు తమ రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ప్రకటించి ఒకరిపై ఒకరు విమర్శలు రువ్వుకున్నారు.

తాజాగా కావేరి జలాల పంపిణీ వ్యవహారంపై కేంద్రానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటులో ఎందుకు జాప్యం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వానికి తలఅంటడం గమనార్హం. కావేరి జలాల పంపిణీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ మంగళవారం విచారణకు వచ్చిన సందర్భంగా కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. కావేరి ట్రిబ్యునల్‌ తమిళనాడుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అమలుపరచడంలో కూడా కేంద్రంలోని పాలకులు మొదటి నుంచీ మెతక వైఖరిని అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అక్షింతలతో తమిళనాడులోని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే అధికారం కోసం కుర్చీలాట ఆడుతున్న తమిళ రాజకీయ పక్షాలు సుప్రీం తీర్పుతో​రాష్ట్రాన్ని అల్లాడించనున్నాయి. దీంతో​ఇప్పటికే దినకరన్‌తో వేగలేక పోతున్న పళనిస్వామికి సుప్రీం తీర్పుతో కష్టాలు తప్పేలా లేవు.
Tags:    

Similar News