''మేం ఖాళీగా కూర్చోలేదు పవన్‌''

Update: 2015-07-09 04:37 GMT
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తెలుగుతమ్ముళ్లను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ పవన్‌ వ్యాఖ్యల్ని ఖండించటం.. దీనికి బదులుగా తన ట్వీట్స్‌ ద్వారా పవన్‌ సమాధానం చెప్పే ప్రయత్నం చేయటం తెలిసిందే.

రెండు వైపుల నుంచి పెరిగిన మాటల తీవ్రతతో రెండు మిత్రపక్షాల మధ్య దూరం పెరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. తాజాగా పవన్‌ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత.. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార  ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు ఖండించారు. తమను తాము సమర్థించుకునే పని చేశారు. ఏపీ ఎంపీలు ఎవరూ ఖాళీగా లేరని.. ప్రత్యేకహోదా సాధన కోసం కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొన్నారు.

పవన్‌ ప్రత్యేక హోదా కోరుకోవటంలో తప్పు లేదు కానీ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మాత్రం సరికాదంటూ చెప్పుకొచ్చారు. మిగిలిన ఎంపీల మాదిరి పరుషంగా మాట్లాడని కంభంపాటి.. పవన్‌ తొందరపడి వ్యాఖ్యలు చేయరాదని.. ఏడాది కాలంగా ఢిల్లీలో తాము ఉండి చేస్తున్న కృషిని చెప్పుకొచ్చారు. తమ కృషి వల్లే పలు అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందంటూ తాము సాధించిన అంశాలకు సంబంధించిన చిట్టాను విప్పుతున్నారు.




Tags:    

Similar News