వలస నేతలతో కారు కుదుపులు

Update: 2018-09-08 04:49 GMT
ముందస్తు ప్రకటించేశారు. అభ్యర్ధుల జాబితా కూడా విడుదల చేసేశారు. తెలంగాణ రాష్ట్ర సమతి తన ఎన్నికల జోరును పెంచేసింది. అయితే కారులో కుదుపులు మాత్రం తీవ్రం అయ్యాయి. తమ పాత మిత్రుడు అనుకుని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చిన వారికి - మనకు భరోసా ఇచ్చాడుగా అని కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నాయకులకు మాత్రం కల్వకుంట్ల వారు చేయిచ్చారు. టిక్కట్లు ఖాయమని - మీరు పార్టీలోకి రావడమే ఆలస్యమంటూ చాలా మంది నాయకులను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకున్నారు. వారు కూడా అదే ఆశతో కారు ఎక్కేశారు. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి 67 మంది ఎమ్మెల్యేలున్నారు. వారికి తోడు మిగిలిన పార్టీల నుంచి వచ్చిన వారితో కలిసి శాసనసభ రద్దు సమయానికి 90 మందికి పైగా శాసనసభ్యులయ్యారు. వీరందరికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిక్కట్లు ఇచ్చారు. ఉద్యమ సమయం నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారికి, తమను నమ్ముకుని పార్టీలోకి వచ్చిన వారికి టిక్కట్లు దక్కకపోవడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారు.

మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు గతంలో చాలా స్నేహం ఉండేది. ఆ స్నేహంతోనే మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలో చేరే ముందు ఉమా మాధవరెడ్డికి ఆలేరు నుంచి కాని - భువనగిరి నుంచి కాని టిక్కట్ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. నువ్వు నా సోదరివి అని కూడా దగ్గరకు తీసుకున్నారు. తీరా టిక్కట్ల సమయం వచ్చే సరికి ఆమెకు మొండి చేయి చూపించారు. దీంతో ఉమా మాధవరెడ్డి భవిష్యత్ ఏమిటీ అని అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇక అదిలాబాద్ జిల్లాకు చెందిన రమేష్ రాథోడ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే ముందు ఆయనకు కూడా టిక్కట్ ఖాయమని నమ్మబలికారు. ఇప్పుడు ఆయన కూడా టిక్కట్ ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. జూబ్లీహిల్స్ నుంచి టిక్కట్ ఆశించిన విజయ రామారావుకు నిరాశే ఎదురైంది. పెద్దపల్లి టిక్కట్ కోసం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన భానుప్రపాద్ కు కూడా టిక్కట్ దక్కలేదు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా తెరాసలో చేరిన వారందరూ అసంత్రప్తితోనే ఉన్నారు. వీరంతా తమ భవిష్యత్ ఏమిటీ అనే ఆలోచనలో పడ్డారు. ముఖ‌్యమంత్రి కె.చంద్రశేఖర రావు మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటానని, వివిధ పదవులు ఇస్తానని చెబుతున్నా ఒకపారి అధికారంలోకి వచ్చారంటే ఇక ఆయన ఎవరిని పట్టించుకోరనే ఆందోళన వీరిలో కనిపిస్తోంది. దీంతో రానున్న ఎన్నికలపై ఈ అసంత్రప్త నేతల ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News