ఆ తెదేపా ఎంపీ జగన్ తో ఫొటో దిగాడు

Update: 2016-02-24 10:22 GMT
అనంతపురం జిల్లా అగ్ర నేత జేసీ దివాకర్ రెడ్డి తీరే వేరు. ఆయన సొంత పార్టీలో ఉన్న వాళ్లను తిట్టగలడు.. ప్రత్యర్థి పార్టీలో ఉన్న వాళ్లను పొగడగలడు. బోళా మనిషి లాగా.. మనసుకేమనిపిస్తే అది చేసేసే వ్యక్తిలాగా కనిపిస్తారు కానీ.. ఆయన ఏం చేసినా అందులో ఓ స్ట్రాటజీ ఉంటుంది. మరి బుధవారం ఏ స్ట్రాటజీతో చేశారో తెలియదు కానీ.. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న జేసీ.. పార్లమెంటు ఆవరణలో ప్రత్యర్థి పార్టీ నేత అయిన జగన్ తో రాసుకు పూసుకు తిరిగారు. జగన్ తో కలిసి ఫొటో కూడా దిగారు.

బుధవారం పార్లమెంటు సమావేశాలు మొదలైన సందర్భంగా పార్లమెంటు ఆవరణలో జగన్, జెసి దివాకరరెడ్డి ఎదురు పడ్డారు. ఆ సందర్భంగా వారు మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. అనంతరం జేసీనే పిలిచి మరీ.. జగన్ తో కలిసి ఫొటోలు దిగారు. ఐతే ఈ కలయిక ఏ ఊహాగానాలకు తెర తీస్తుందో అని అప్పుడే అప్రమత్తం అయిపోయారు జేసీ.

అక్కడే ఉన్న మీడియాల్ని పిలిచి.. ఈ పలకరింపులు, ఫొటోలు చూసి.. తాను వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరానని వార్తలు వేస్తారా అని చమత్కరించారు. బుధవారం జేసీ పుట్టిన రోజు కూడా కావడం విశేషం. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పగా.. కృతజ్నతలు చెప్పిన జేసీ, ముందు మీరు హ్యాపీగా ఉండండని వ్యాఖ్యానించారు. జగన్ మీద ఈ మధ్య జేసీ చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే వీరి కలయిక ఆశ్చర్యం కలిగిచే విషయమే.
Tags:    

Similar News