అక్కడ జనసేన పార్టీ ఆఫీసుకు టూలెట్ బోర్డు పెట్టారు!

Update: 2019-08-26 05:03 GMT
ఓటమిని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు. గెలుపు కొండంత బలాన్ని తీసుకొస్తే.. ఓటమి పాతాళంలోకి కూరుకుపోయే నిరాశను కమ్మేస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో దారుణమైన పరాజయాన్ని సొంతం చేసుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవటం తర్వాత.. తాను స్వయంగా పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓటమిపాలు కావటం పవన్ తో పాటు.. ఆయన్ను అభిమానించే చాలామందిని షాక్ కు గురి చేసింది.

అయితే.. తనకు ఎదురైన ఓటమిని జస్ట్ పావు గంటలో అధిగమించానని.. ఓటమిని అధిగమించేందుకు తనకు చాలా తక్కువ టైం పడుతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేనాని. ఆయనకు చేతనైనట్లుగా ఓటమిని ఎదుర్కోవటం.. దాన్ని అధిగమిస్తూ పని చేయటం అందరికి సాధ్యం కాదుగా. అందుకే కాబోలు ఎన్నికలకు కాస్త ముందుగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జనసేన పార్టీ ఆఫీసును భారీగా ఓపెన్ చేశారు.

ప్రత్తిపాడు శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. దాన్ని తిరిగి సదరు భవన యజమానికి అప్పగించేశారు.  ఈ ఏడాది మార్చిలో పార్టీ ఆఫీసును ప్రారంభించిన జనసేన నేతలు.. ఆర్నెల్లు కూడా కాకముందే ఆఫీసును ఖాళీ చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ పార్టీ తరఫున పని చేసిన నాయకులంతా జనసేనను వదిలారు. దీంతో.. పార్టీ ఆఫీసును ఖాళీ చేశారు.

ఇలాంటి పరిస్థితే ఏపీలోని పలు నియోజకవర్గాల్లో చోటుచేసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జనసేన పార్టీ ఆఫీసుగా గుర్తింపు పొందిన భవనాన్ని.. తాజాగా బార్ అండ్ రెస్టారెంట్ కు ఇస్తామని సదరు భవన యజమాని చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ బరి నుంచి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు టీడీపీ నుంచి జనసేనలోకి రావటం.. ఆర్భాటం చేయటం తెలిసిందే. ఓటమి తర్వాత ఆ భవనం వద్దకు రావెల రాను కూడా రాలేదు. ఇటీవల ఆయన బీజేపీలో చేరారు. మొత్తానికి మొన్నటి వరకూ జనసేన కార్యాలయం రానున్న రోజుల్లో బార్ అండ్ రెస్టారెంట్ గా మారనుందన్న మాట.



Tags:    

Similar News