సీఎం జగన్ ఫోన్ కాల్ తో.. మంత్రికి ముచ్చెమటలు!

Update: 2019-09-12 08:21 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ఒకే మాట చెబుతూ ఉన్నారు. అవినీతి రహిత పాలనే తన ధ్యేయమని ఆయన మొదటి నుంచి ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ దిశగా జగన్ గట్టిగానే కృషి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా జరిగే నియామకాల నుంచి ప్రతి ఒక్క అంశంలోనూ జగన్ పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే వంద కోట్ల రూపాయలకు మించిన కాంట్రాక్ట్ ఏదైనా సరే దానికి జ్యూడీషియల్ కమిటీ ఆమోదముద్ర తప్పనిసరి చేశారు. ఆ మేరకు కమిటీ చైర్మన్ నియామకం కూడా జరిగింది.

తన వరకూ ఇలా క్లియర్ గా ఉంటున్న  జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి తరుణంలో తన మంత్రులకు కూడా గట్టిగానే ఈ విషయంలో ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కొందరు మంత్రులు అలవాట్లను మానుకోలేపోతూ ఉన్నారు. కొన్ని ప్రైవేట్ డీల్స్  చేయడానికి వారు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. తమ వద్దకు వచ్చిన డీల్స్ ను వాళ్లు చేయడానికే మొగ్గు చూపుతున్నారు.

ఇలాంటి తరుణంలో ఏపీ మంత్రి ఒకరు చేసిన డీల్ ఒకటి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినట్టుగా సమాచారం. ఆయన గోదావరి జిల్లాలకు చెందిన ఒక మంత్రి. జగన్ కు సన్నిహితుడే. వైజాగ్ లో ఒక సెటిల్ మెంట్ లో ఆయన వేలు పెట్టారట. అందుకు గానూ భారీ ముడుపు తీసుకోవడానికి కూడా ఆయన రెడీ అయ్యారట.

అందుకు సంబంధించిన డీల్ సాగుతూ ఉండగా.. ఆ చర్చ కోసం సదరు మంత్రి వైజాగ్ లోని ఒక హోటల్ లో మకాం పెట్టగా.. సరిగ్గా అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఆఫీసు నుంచి ఆ మంత్రికి కాల్ వెళ్లినట్టుగా సమాచారం. మంత్రిగారిని ముందుగా పలకరించిన జగన్ మోహన్ రెడ్డి ఒకే ప్రశ్న వేశారట. 'అన్నా.. చెక్కా - క్యాషా..' అంటూ వ్యంగ్యంగా అడిగారట. దీంతో ఆ మంత్రి అవాక్కయినట్టుగా తెలుస్తోంది.

ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా జగన్ మోహన్ రెడ్డి ఆ మంత్రి యాక్టివిటీస్ మీద పూర్తిగా సమాచారం అందుకుని.. సరిగ్గా డీల్ జరుగుతున్న వేళ ఫోన్ చేసి.. అలా వారించినట్టుగా తెలుస్తోంది. స్వయంగా సీఎం ఫోన్ చేసి.. అలా మాట్లాడే సరికి - ఆ మంత్రి కూడా షాక్ అయిపోయి.. ఉన్న ఫలంగా అక్కడ నుంచి బయటపడినట్టుగా తెలుస్తోంది.

ఈ వ్యవహారంతో రెండు విషయాలపై స్పష్టత వస్తోంది. అందులో ఒకటి.. అవినీతి రహిత పాలన మీద జగన్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారనేది - రెండోది.. ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలా పని చేస్తాయనే అంశం గురించి కూడా స్పష్టత వస్తోందని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News